ప్రాణాలు తీస్తోన్న ఆస్పత్రుల బిల్లులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కరోనా ఐసోలేషన్ కేంద్రాల్లో ఆక్సిజన్ అందిస్తున్నా... పడకలు లేక చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. భాగ్యనగరంలో మంచి వైద్యం దొరుకుతుందన్న ఆశతో అక్కడకు వెళ్తున్న రోగులు చివరకు అప్పుల పాలవుతున్నారు. జీవితాంతం కష్టపడ్డా అప్పు తీర్చలేని దయనీయ స్థితిలో కూరుకుపోతున్నారు.
నిత్యం దోపిడీ...
నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రు (Private Hospitals)ల్లో నిత్యం దోపిడీ కొనసాగుతోంది. అస్వస్థతతో తొలుత స్థానిక ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితులు... అక్కడ చికిత్స పొందిన అయిదారు రోజులకే నాలుగైదు లక్షలు చెల్లించాల్సి వస్తోంది. వాస్తవానికి కొవిడ్ రోగుల్ని (Covid Patients) పరీక్షించి వైద్యం అందించాలంటే... ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ వంటి ప్రత్యేక వైద్యులు ఉండాలి. కానీ చాలా చోట్ల స్పెషలిస్టులు లేకుండానే నెట్టుకొస్తున్నారు. స్థానికంగా వ్యాధి నయం కాక హైదరాబాద్ వెళ్లి రూ. 10 లక్షలకుపైగా వెచ్చిస్తున్నారు.
సర్వం తాకట్టు పెట్టినా...
మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలున్న దేవరకొండ ప్రాంతానికి నియోజకవర్గ కేంద్రంలోని వైద్యశాలలే దిక్కు. పేదల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పెద్దఎత్తున డబ్బులు దండుకుంటున్నా... పట్టించుకునేనాథుడే లేరు. దేవరకొండ మండలం దుబ్బతండాకు చెందిన రేషన్ డీలర్ రాగ్యానాయక్‌కు ఏప్రిల్ చివరి వారంలో కరోనా నిర్ధరణ అయింది. హోం క్వారంటైన్‌లో శ్వాస సమస్య రావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స కోసం భూమితోపాటు బంగారం తాకట్టు పెట్టి రూ. 10 లక్షలు బిల్లు చెల్లించినా ప్రాణాలు దక్కలేదు.
దయనీయ పరిస్థితులు...
మరో ఘటనలో దేవరకొండ మండలం కొండభీమనపల్లికి చెందిన కుమార్ ఆటోడ్రైవర్. ఏప్రిల్ 23న పాజిటివ్ నిర్ధరణ కాగా దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో చేరి 3 రోజులు ఉన్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం వల్ల హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో 5 రోజులు చికిత్స తీసుకున్నారు. రూ. 12 లక్షల బిల్లు (12 Lakh bill) చెల్లించడం కోసం ఇల్లు తాకట్టు పెట్టి రూ. 5 లక్షలు, మరో రూ. 7 లక్షలు అప్పు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇంట్లోనే ఆక్సిజన్ ఏర్పాటు చేసుకున్నాడు.
లక్షలు చెల్లించి వైద్యం తీసుకుని కొందరు వ్యాధి నయమై ఇంటికి వెళుతుంటే.. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబ పెద్ద కాలం చేయడం, అప్పులు తీర్చే దారి కనపడక ఆయా కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతోంది.