Bhatti Vikramarka Padayatra in Yadadri: ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో.. దాని కోసమైనా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందామని కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ కార్యక్రమంలో భాగంగా ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం రాత్రికి యాదాద్రి చేరుకుంది. ఈ ప్రాంతానికి చేరుకోగానే.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాతగుట్ట కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
Bhatti Comments on CM KCR : ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల దేవుడైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ఖరీదైన దేవుడిగా మార్చారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. స్వామి వారిని సామాన్య ప్రజలకు దూరం చేశారని మండిపడ్డారు. యాదాద్రి దేవుడి దగ్గరకి కారులోనే భక్తులు రావాలని.. సామాన్యులు ఎక్కే ఆటోలు పనికి రావని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని ఆరోపణలు చేశారు. ఈ కొండపైకి ఆటోలను నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం.. 300 మంది ఆటో కార్మికుల పొట్ట కొట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అందుకే ఈ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆటోలను కొండపైకి అనుమతిస్తామని మాటిచ్చారు. ఆ మాటలకు కట్టుబడి ఉంటామని భట్టి స్పష్టం చేశారు.