Bhatti Peoples March Padayatra in Nalgonda : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 89వ రోజు గుర్రంపోడు మండలం జువ్విగూడెం నుంచి ప్రారంభమైన యాత్ర.. సాయంత్రానికి మండల కేంద్రానికి చేరుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి, స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడిన భట్టి.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Bhatti Padayatra Latest Updates : ఎందరో అమరుల ప్రాణ త్యాగాలతో ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యార్థుల బలిదానాలు చూడలేక.. సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో అందరికి అన్ని సదుపాయాలు లభిస్తాయని ఆశిస్తే.. రాష్ట్ర వనరులు మొత్తం సీఎం కేసీఆర్, ఆయన కుటుంబానికే దక్కాయని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు రేషన్ బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నిరుద్యోగులను పట్టించుకోలేదన్న ఆయన.. ఇటీవల పరీక్షలు పెడితే లీకేజీతో అవీ ఎటూ కాకుండా పోయాయన్నారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక.. రాష్ట్రంలో ఏ కాల్వ తవ్వారని చెరువులు, కాల్వల పండగ చేసుకోవాలని భట్టి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు, కాల్వల ద్వారా నీరు ఇస్తున్నందుకు పంగడ చేసుకోవాలా అని నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాలుఏవని ప్రజలు అడుగుతున్నారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్‌ఎస్ నాయకుల జీవితాల్లో భారీగా మార్పులు వచ్చాయని ఆరోపించిన ఆయన.. సాధారణ ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు.
'కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతన్నలకు ఒకేసారి రూ.2 లక్షల రుణామాఫీ చేస్తాం. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. కేసీఆర్ ప్రభుత్వం రేషన్ బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. అధికారంలోకి రాగానే రేషన్ దుకాణంలో 9 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తాం. నాగార్జున్ సాగర్‌లో జానారెడ్డి చేసిన అభివృద్ధి తప్ప బీఆర్‌ఎస్ నాయకులు చేసిందేమీ లేదు.' - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత