సామ్యవాద, లౌకికవాద భావజాలం కలిగిన ప్రజలను డబ్బుతో కొనుగోలు చేయాలనే భ్రమలో తెరాస, భాజపా ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సిద్ధాంతాల భావజాలానికి మునుగోడు ప్రజలు కట్టుబడి ఉంటారే తప్ప.. డబ్బులకు అమ్ముడుపోరని స్పష్టం చేశారు. నిజాం అహంకారానికి వ్యతిరేకంగా పోరాడి రజాకార్ల మెడలు వంచిన గడ్డ మునుగోడు అని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైన మునుగోడు ప్రజలకు ఎనలేని అభిమానం ఉందని భట్టి పేర్కొన్నారు. సామ్యవాద, లౌకికవాద భావజాలం కలిగిన మునుగోడు ప్రజలు వారికి ఉపయోగపడే పార్టీలనే ఇప్పటివరకు గెలిపించారని గుర్తు చేశారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మండల కార్యకర్తల సమన్వయ సమావేశంలో భట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని తెరాస మునుగోడు ప్రజలను డబ్బుతో తమవైపు తిప్పుకోవాలని.. రూ.వందల కోట్లు తీసుకొచ్చి వారి ఆత్మగౌరవం పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. ధన అహంకారాన్ని ప్రదర్శిస్తున్న తెరాస, భాజపా మెడలు వంచడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని భాజపా సవాల్ చేస్తూ అడుగులు వేస్తూ అణగదొక్కుతుందని ఆరోపించారు.
అధికారానికి, డబ్బుకు అడ్డే లేదన్న అహంభావపూరిత వాతావరణంలో తెలంగాణపై భాజపా దాడి చేయడానికి వస్తున్నట్లు కనిపిస్తోందని భట్టి విమర్శించారు. తెలంగాణ ప్రజలను అణగదొక్కాలని చూసిన ప్రతి సందర్భంలో మట్టి మనుషులుగా ఎదిరించి ఎదురొడ్డి పోరాటం చేశారు తప్ప.. తలవంచుకున్న చరిత్ర ఈ పోరాటాల గడ్డకు లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో తెరాస పాలన ఇక చాలు అని ప్రజలు అంటున్నారు: రాష్ట్రంలో తెరాస పాలన ఇక చాలు అని ప్రజలు అంటున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దోపిడీ, అవినీతికి పాల్పడుతూ వనరులను ప్రజలకు ఇవ్వకపోగా.. తెచ్చుకున్న తెలంగాణను నవ్వుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సమాజంలో తలెత్తుకొని బతకాలన్న ఆత్మగౌరవం తెరాస పాలనలో భంగపాటకు గురైందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిన తెరాస డబ్బు, మద్యం ప్రలోభాలతో మునుగోడును ఆక్రమణ చేయాలని చూస్తుందని మండిపడ్డారు.