Bandi Sanjay on Munugode Bypoll Result: మునుగోడు ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చబోతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మునుగోడులో భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెరాస అధికార దుర్వినియోగం, ప్రలోభాలు, ఒత్తిళ్లు, డబ్బు, మద్యంతో బెదిరింపులకు పాల్పడ్డా.. మునుగోడు ఓటర్లు తెగువ చూపారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రక్రియను నాశనం చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. పోలింగ్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించకుండా ఎన్నికల కమిషన్ కూడా తప్పు చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. ఓటు హక్కు వినియోగించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచిన మునుగోడు యువతకు కృతజ్ఞతలు తెలిపారు. పుట్టకముందే బీఆర్‌ఎస్ ఖతమవుతోందని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారు.
ఎన్నికల కమిషనర్ కేసీఆర్ జేబులో పనిమనిషి: రాచకొండ సీపీ, నల్గొండ ఎస్పీ తెరాసకు కొమ్ముకాశారని బండి సంజయ్ ఆక్షేపించారు. రాజకీయాలను సర్వనాశనం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల కమిషనర్ కేసీఆర్ జేబులో పనిమనిషిగా మారిపోయారని ధ్వజమెత్తారు. పోలింగ్ పై తెరాస పార్టీ ఫేక్ సర్వేలను సర్క్యలేట్ చేస్తోందన్నారు. ఓటు హక్కు వినియోగించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచిన మునుగోడు యువతకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. రంగం తండా సమస్యలు పరిష్కరించకుంటే మంత్రి కేటీఆర్‌ను ప్రజలు రోడ్డు మీద ఉరికిస్తారని ఎద్దేవా చేశారు.