Bandi Sanjay padayatra: బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఎనిమిదో రోజు నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో ఇవాళ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాదయాత్రంలో భాగంగా గుండ్రంపల్లి నుంచి సుంకనపల్లికి వెళ్తుండగా కల్లు గీత కార్మికులతో ముచ్చటించారు. అంతే కాకుండా కల్లు రుచి చూసి వారి సమస్యలపై ఆరా తీశారు.
తాటి కల్లును తాగిన బండి సంజయ్ కార్మికులతో ఆర్థిక, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గౌడ కార్మికుల కల్లు గీత వృత్తిని కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని బండి సంజయ్ అన్నారు. అంతే కాకుండా గ్రామగ్రామాన బెల్టు షాపులు, చీప్ లిక్కర్ అమ్ముతున్నారని ఆరోపించారు. ఇవాళ మొత్తం 14.5 కిలోమీటర్ల మేర కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ రాత్రికి సిరిపురం సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు.
తెరాస ప్రభుత్వం 50శాతానికి పైగా ఉన్న బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణిచివేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో నామమాత్రంగా నిధులు కేటాయిస్తూ.. వాటిలోనూ 10శాతం కూడా ఖర్చు పెట్టడం లేదని మండిపడ్డారు. ఈ అంశంపై ఆర్‌టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే అనేక అంశాలు తేటతెల్లమవుతున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.