Munugode Bypoll Today: మునుగోడు శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక అందరి దృష్టినీ ఆకర్షించింది. రాజకీయ పార్టీలన్నింటికీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. పార్టీలు, అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డి ఉపపోరును ఎదుర్కొన్నారు. నేతాగణం అంతా మునుగోడులో మోహరించింది. పల్లెపల్లెనూ, వాడవాడనూ పలు దఫాలు చుట్టేస్తూ ఓటరు మహాశయుడ్ని ప్రసన్నం చేసుకున్నేందుకు అహర్నిశలు శ్రమించారు. ఎన్నికల సంఘం ఒక్కో అభ్యర్థికి నిర్దేశించిన వ్యయ పరిమితి రూ.40 లక్షలు మాత్రమే. మునుగోడు ఉపఎన్నిక తీరుతెన్నులను చూస్తే మాత్రం అది ఏ మూలకూ సరిపోదన్న భావన స్పష్టంగా కలగకమానదు.
కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చయ్యాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డబ్బు, మద్యం, ముక్కకు ఎక్కడా లోటు లేకుండా ఎన్నికల ప్రక్రియను రక్తికట్టించారు. ఓ రకంగా చెప్పాలంటే ఇటీవలి కాలంలో దేశంలోనే అత్యంత ఖరీదైన ఉపఎన్నికల్లో ఒకటిగా మునుగోడును పరిగణించాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత హోరాహోరీగా సాగిన ఉపపోరులో అంతిమఘట్టం నేడు జరుగుతోంది. ఇన్నాళ్లుగా జరిగిన పార్టీల ఎత్తులు, పైఎత్తులు.. వ్యూహ ప్రతివ్యూహాలపై ఓటరు తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.
47 మంది అభ్యర్థులు ఉపపోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపా అభ్యర్థిగా బరిలో దిగారు. గతంలో గెలుపొంది 2018లో ఓటమి పాలైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరోమారు తెరాస తరఫున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి ఎన్నికల పోరులో నిలిచారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా శంకరాచారి, 10 మంది ఇతర పార్టీల అభ్యర్థులు, 33 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు.
పక్కాగా ఏర్పాట్లు..: పోలింగ్ కోసం 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 41 వేల 855. అందులో పురుషులు లక్షా 21 వేల 662 కాగా.. మహిళలు లక్షా 20 వేల 126 మంది ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన, దివ్యాంగులకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది. 798 మంది ఈ సదుపాయాన్ని ఎంచుకోగా.. అందులో 685 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. నోటా కలిపి ఒక్కో ఈవీఎంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం. ఇందుకోసం 1192 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు. కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను 596 చొప్పున అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉండే అవసరాలతో పాటు పది శాతం అదనంగా సిద్ధం చేసి ఉంచారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే స్పందించి సరిదిద్దేందుకు అనువుగా ఒక్కో సెక్టార్కు ఒకరు చొప్పున 24 మంది ఇంజినీర్లను అందుబాటులో ఉంచారు.