Munugode By Election: మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ ఈ నెలాఖరులో వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో అధికార తెరాసతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, భాజపాలు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో తక్షణం ఇంటింటికీ ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ మేరకు అన్ని పార్టీలు వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గురువారం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని పార్టీ ప్రారంభించింది.
ఇప్పటికే మండలాల వారీగా నియమించిన ఇన్‌ఛార్జులు గ్రామాల్లో తిరుగుతూ కాంగ్రెస్‌కు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం మునుగోడులో జరిగే కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, మధుయాస్కీతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఏ మేరకు హాజరవుతారోననే చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది. మరోవైపు టిక్కెట్ ఆశావహులు కొన్నాళ్ల నుంచే మండలాల వారీగా ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతివ్వాలని కోరుతున్నారు. పార్టీ టిక్కెట్ ఎవరికివ్వాలనే దానిపై ఇప్పటికే పీసీసీ సమగ్ర సమాచారాన్ని ఏఐసీసీకి నివేదించింది. మరో వారం, పది రోజుల్లో అభ్యర్థి ప్రకటన వచ్చే అవకాశముందని మాజీ మంత్రి ఒకరు వెల్లడించారు.
సంక్షేమ పథకాలతో ముందుకు:రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న అధికార తెరాస.. మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మండలాల వారీగా ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలుపునకు కార్యాచరణపై క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తోంది. గత ఎనిమిదేళ్లలో మునుగోడు నియోజకవర్గానికి సంక్షేమ పథకాల ద్వారా కలిగిన లబ్ధితో పాటు ఫ్లోరైడ్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నామో ఆ పార్టీ నేతలు ప్రతి సమావేశంలోనూ కార్యకర్తలకు వివరిస్తున్నారు.
క్షేత్రస్థాయి ప్రచారంలో భాగంగా వీటిన్నింటినీ ప్రజలకు చెప్పాలని వారు క్యాడర్‌ను కార్యోన్ముఖులను చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలను నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు పురపాలికలకు ఇన్‌ఛార్జులుగా నియమించడంతో వారు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని అధిష్ఠానానికి నివేదిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు నిఘావర్గాలు, ప్రైవేటు సంస్థలతో చేసే సర్వే నివేదికలపైనా అధికార పార్టీ తీవ్రంగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.