Water Disputes in Telangana: తెలంగాణ పరిధిలోని నదీ జలాలను కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలోకి తీసుకుంటూ జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నీలగిరి నుంచి మరో సమర శంఖారావం పూరించాలని వక్తలు నిర్ణయించారు. నల్గొండ లయన్స్‌క్లబ్‌లో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం జరిగిన అఖిలపక్ష పార్టీలు, మేధావుల రౌండ్‌టేబుల్ సమావేశంలో నదీ జలాల పరిరక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పుపట్టారు. కేంద్రం కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో సమస్యను సృష్టిస్తుందే తప్ప పరిష్కరించడం లేదని రాజ్యాంగ నిపుణుడు మాడభూషి శ్రీధర్ చెప్పారు.
నదీ జలాలను కేంద్రం తన అధీనంలోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం పెత్తనం తగదని ఆచార్య కోదండరాం అన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వస్తే రాష్ట్రాల పరిధిలో ఉన్న ప్రాజెక్టులు కేంద్ర పరిధిలోకి మారిపోతాయన్నారు. కృష్ణా, గోదావరి నదుల ఎగువ ఉన్న రాష్ట్రాల్లో ఏవిధమైన ఆధిపత్యం చలాయించకుండా దిగువ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హక్కులను కేంద్రం పూర్తిగా తన అధీనంలోకి తీసుకోవడం సరైంది కాదని సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు.