మునుగోడు ఉపఎన్నికల ప్రచారం జోరందుకుంది. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సామాజికవర్గాల వారీగా ఓటర్లను కలుస్తూ కారు పార్టీకి మద్దతివ్వాలని కోరుతున్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయకుండా స్వార్థం కోసం రాజీనామా చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసముందని ఎర్రబెల్లి పునరుద్ఘాటించారు.
మునుగోడు ఉపఎన్నికలో తెరాస గెలుపు ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గాన్ని ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడం, గుండ్లబావిలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి బైక్ ర్యాలీ ద్వారా ఓట్లు అడిగారు. మహ్మదాపూర్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు.
ధర్మయుద్ధంలో ప్రజలు ఆశీర్వదించాలి..: మునుగోడు మండలం కొరటికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. తెరాసతో చేస్తున్న ధర్మయుద్ధంలో ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మునుగోడు సమగ్రాభివృద్ధి కోసమే పదవీ త్యాగం చేసి ప్రజాతీర్పు కోసం బ్యాలెట్ పోరులో పాల్గొంటున్నట్లు వివరించారు. చౌటుప్పల్‌లో కోమటిరెడ్డి సతీమణి లక్ష్మి ప్రచారం నిర్వహించారు. రాజ్‌గోపాల్‌రెడ్డిని ప్రజలు ఆదరిస్తే.. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తారని ఆమె విజ్ఞప్తి చేశారు.