నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో... మూడు ప్రధాన పార్టీల మధ్య ప్రచార హోరు క్రమంగా వేడెక్కుతోంది. హాలియాలో పలువురు భాజపా కార్యకర్తలు... మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో తెరాసలో చేరారు. దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్ నిష్క్రమించినట్లేనని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికలతో విపక్షాల చిరునామా గల్లంతేనని తలసాని ఎద్దేవా చేశారు. త్రిపురారం మండలం బడాయిగడ్డ, డొంక తండా, అప్పలమ్మగూడెం, బొర్రాయిపాలెం సహా వివిధ గ్రామాల్లో తెరాస విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే జాజుల సురేందర్ ప్రచారం చేశారు.
భారతీయ జనతా పార్టీ... త్రిపురారం మండలం కాపువారిగూడెం, పలుగుతండా, మీట్య తండా, కుంకుడుచెట్టు తండా, రాగడపలో ప్రచారం చేపట్టింది. ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్ నాయక్... తన సొంత గ్రామమైన పలుగుతండాలో స్థానికులను కలుసుకున్నారు. ఆ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆయన ప్రసంగం మొదలుపెట్టిన తర్వాత సైతం... కంట తడి పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి... పెద్దవూర మండలం బెట్టల తండా, ఊరబావితండా, నీమానాయక్ తండా, గోపాల్ తండా, పుల్యాతండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.