ముఖ్యమంత్రి కేసీఆర్ తాతకు నమస్తే. మీ ఆరోగ్యం ఎలా ఉంది?. మీరు బాగుంటేనే నాలాంటి ఎంతో మంది పిల్లలు బాగుంటారు. నా పేరు చైత్ర. వయస్సు ఆరేళ్లు. నేను హైదరాబాద్‌లోని రెయిన్ బో ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడో ఊళ్లో ఉండాల్సిన నేను ఆసుపత్రిలో ఎందుకున్నానని అనుకుంటున్నావా? చెబుతాను తాత.... చెబుతాను.
మాఊరు నల్గొండ జిల్లా అనుముల మండలం ముక్కమాల గ్రామం. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే ఉంటుంది మాఊరు. అమ్మ పేరు నాగమ్మ.... నాన్నపేరు సతీశ్. ఇద్దరు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ నన్ను మా చెల్లిని పెంచుతున్నారు. ఓ రోజు అమ్మానాన్న పనికెళ్తూ మమ్మల్ని అమ్మమ్మ దగ్గర ఉంచి వెళ్లారు. అమ్మమ్మ దేవుడికి దీపం పెట్టి బయటకెళ్లింది. నేను, చెల్లి దేవుడికి దండం పెడుతుండగా దీపం నా బట్టలకు అంటుకుంది. బాగా ఏడ్చాను. అప్పటికే సగం వరకు కాలిపోయాను. అమ్మానాన్న, అమ్మమ్మ ఏడ్చుకుంటూ హాలియాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ అంకుల్.... పాపకు సీరియస్ గా ఉంది నల్గొండకు తీసుకువెళ్లమన్నారు. నల్గొండలోని సాయిరక్ష ఆస్పత్రికి తీసుకెళ్లాక అక్కడి డాక్టర్ అంకుల్ నన్ను చూసి హైదరాబాద్ తీసుకువెళ్లమని చెప్పారు. అమ్మానాన్నలకు బాగా భయమేసింది. నేను బతకనేమోనని. అక్కడి నుంచి ఎల్బీనగర్ లోని అరుణ ఆసుపత్రిలో చూపించారు. అప్పటికే కాలిపోయిన నా శరీరం బాగా పాడైందట. నేను బతకాలంటే పెద్దాసుపత్రికి తీసుకువెళ్లమని రాశారు. అలా నాలుగైదు ఆస్పత్రులు తిరిగాక ఇక్కడికొస్తే కానీ నన్ను పట్టలేదు. అప్పటికే అమ్మానాన్నల దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. 40 రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నాను తాతయ్య. నన్ను బతికుంచునేందుకు నాన్న కట్టిన తాళిని, అమ్మమ్మ చేయించిన నగలనూ అమ్మేశారంట. అలా ఇప్పటివరకు బాగానే పైసలైనయని అమ్మ చెబుతుంటే విన్నా. ఇంకా బాగానే ఖర్చవుతుందట. - చైత్ర.