తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్ ​సమరంలో పోటెత్తిన ఓటర్లు... 86.2 శాతం పోలింగ్‌ - నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోలింగ్

వృద్ధురాలిని ఓటు వేయించే విషయంలో ఇరుపార్టీల మధ్య నెలకొన్న చిన్న వాగ్వాదం మినహా... నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో... అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో 88 శాతం పోలింగ్ నమోదైందని... రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ప్రకటించారు.

86.2 percentage polling in Nagarjuna saggar by election
86.2 percentage polling in Nagarjuna saggar by election

By

Published : Apr 18, 2021, 4:18 AM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అనంతరం ఈవీఎంలను నల్గొండలోని స్ట్రాంగ్ రూమ్​కు తరలించారు. ఈ ఎన్నికల్లో 36 మంది కొవిడ్ పాజిటివ్ వ్యక్తులు... ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈవీఎంలలో నెలకొన్న సాంకేతిక సమస్య వల్ల... నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో పలు చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఓటు వేసేందుకు వచ్చిన వారు... రెండు గంటల పాటు నిరీక్షించారు. ఉదయం ఆరున్నర నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం మొదలైంది. కొవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయగా... ప్రతి ఒక్కరికి గ్లవ్స్ తోపాటు శానిటైజర్ అందుబాటులో ఉంచారు. సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గుర్రంపోడు మండలం వట్టికోడులోని బూత్​లో... ఓటింగ్ యంత్రం పనిచేయలేదు. సాంకేతిక సిబ్బంది వచ్చి సరిచేసేసరికి... గంటా 15 నిమిషాలు పట్టింది. నిడమనూరులోని 201/ఏ కేంద్రంలో ఈవీఎంలో సమస్యతో... 56 నిమిషాలు ఆలస్యంగా ఓటు వేసేందుకు అనుమతించారు.

సాంకేతిక సమస్యలు...

త్రిపురారంలోని 265 బూత్​లో... 20 నిమిషాలు ఆలస్యమైంది. ఏజెంట్లు సమయానికి రాలేదని అధికారులు... సిబ్బంది సీళ్లు తెరవకపోవడం వల్లే జాప్యం జరిగిందని ఏజెంట్లు అన్నారు. మాడుగులపల్లి మండలం అభంగాపురంలోనూ ఈవీఎంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. తిరుమలగిరి సాగర్ మండలం తూటిపేట తండాలో ఈవీఎం మొరాయించడం వల్ల... అరగంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. ఓటింగ్ యంత్రాల్లో సమస్యల వల్ల ప్రజలు పడిగాపులు పడాల్సివచ్చింది. తెరాస అభ్యర్థి నోముల భగత్... తన తల్లితో పాటు సతీమణితో కలిసి అనుముల మండలం ఇబ్రహీంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి నాగార్జునసాగర్ హిల్​కాలనీలో... భాజపా అభ్యర్థి రవికుమార్ దంపతులు త్రిపురారం మండలం పలుగుతండాలో ఓటువేశారు.

వృద్ధురాలి వల్ల వాగ్వాదం..

త్రిపురారం మండలం దుగ్గేపల్లిలో... తెరాస, కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. కళ్లు సరిగా కనిపించని వృద్ధురాలితో ఆమె తనయుడు ఓటు వేయిస్తున్న సమయంలో... తెరాస కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. అటు కాంగ్రెస్ శ్రేణులు సైతం అక్కడకు చేరుకోవడంతో... చిన్నపాటి వాగ్వాదం జరిగింది. వెంటనే పోలీసులు... ఇరువర్గాలను అక్కణ్నుంచి పంపించివేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్... నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ, హిల్ కాలనీతోపాటు హాలియాలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా... పోలింగ్ కేంద్రాలకు జనం రాక తగ్గిపోయింది. ఉదయం 11 గంటల తర్వాత... పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్ల సంఖ్య తగ్గింది. సాయంత్రం అయిదింటి తర్వాత జనం రాక మళ్లీ మొదలైంది.

ఇదీ చూడండి: నాగార్జునసాగర్​లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details