నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని గురుకులాల్లో బుధవారం కరోనా కలకలం రేపింది. రెండు గురుకులాల్లోని 15 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు కొవిడ్ నిర్ధారణ అయింది. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు సుమారు 480 మంది విద్యార్థులు ఉన్నారు. మొదట పది మంది అనారోగ్యానికి గురవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ పరీక్షలు చేశారు. వారిలో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది. వెంటనే వైద్యాధికారిణి డా.ఉషారాణి సిబ్బందితో పాఠశాలకు వెళ్లి పరీక్షలు నిర్వహించగా మరో 10 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు పాజిటివ్(10 students and 2 teachers tested corona positive) ఫలితం వచ్చింది.
కాటారంలో నలుగురికి కరోనా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలోని నలుగురు విద్యార్థులకు(Students tested covid positive) కరోనా సోకింది. వారం రోజుల క్రితమే పునఃప్రారంభమైన గురుకులానికి విద్యార్థులు చేరుకోగా మూడు రోజుల క్రితం జలుబు, జ్వరం బారిన పడ్డారు. దీంతో ప్రిన్సిపాల్ రాజేందర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రామారావును సంప్రదించారు. ఈ క్రమంలో పాఠశాలలోని మరో 150 మందికి ర్యాపిడ్, యాంటిజన్ పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్ బారిన పడిన వారిలో ఒకరు తొమ్మిదో తరగతి, ఇద్దరు పదో తరగతి విద్యార్థులు కాగా ఒకరు ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి ఉన్నారు. వీరిని ఉపాధ్యాయులు ఇళ్లకు పంపారు. మిగతా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు.