మార్చాల రామాచార్యులు తెలంగాణ తొలితరం చిత్రకారుడు.. బుక్క సిద్ధాంతి.. తెలంగాణలో తొలి రామాయణంలో బతుకమ్మ పాట రచించిన కవయిత్రి.. మరింగంటి రంగకృష్ణమాచార్యులు.. మరుగునపడిన తెలంగాణ యక్షగాన కవి... ఇలా తెలంగాణ గడ్డపై ఎంతో మంది సామాన్యుల నుంచి అసామాన్యులుగా ఎదిగిన మాన్యులను తన రచనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు గుండోజు యాదగిరి. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన యాదగిరి.. 35 ఏళ్లుగా వివిధ ప్రాంతాల్లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. ప్రస్తుతం విశ్రాంత అధ్యాపకుడిగా ఉన్న యాదగిరి.... పాఠశాల స్థాయి నుంచే సాహిత్యంపై అభిరుచిని పెంచుకున్నారు. తన ఆలోచనలన్నీ తెలంగాణ చుట్టే తిరిగేవి. తొలి తరం ఉద్యమంలోనూ భాగస్వామ్యమైన యాదగిరి.... తెలంగాణ నేలపై ఉన్న వ్యక్తులు, గ్రామాల చరిత్రను రచనలు, పద్యకవితలు, వ్యాసాల రూపంలో తీసుకొస్తూ ప్రజలను చైతన్యపరిచేవారు.
మొదటి పుస్తకం
ఈ క్రమంలో 1969 ఉద్యమ సమయంలో విద్యార్థి దశలోనే అప్పు చేసి అప్పటి తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని చాటేలా "జై తెలంగాణ విప్లవ ఢంకా" పేరుతో కవితాసంకలాన్ని రచించారు. 2009లో పాలమూరు అధ్యయన వేదిక ఆ పుస్తకాన్ని పునర్ముద్రించింది. ఉద్యమంలో ఉన్న వారికి ప్రోత్సాహకంగా, అమరవీరుల త్యాగాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఆ కవితా సంకలనం దోహదపడింది. అప్పటి నుంచి తెలంగాణ సాహిత్యం, ఉద్యమంపై నేటి వరకు యాదగిరి 12 పుస్తకాలు రచించారు. కాలగర్భంలో కలిసిపోతున్న శిల్పుల పేర్లను, వారి విశిష్టతను తెలిపేలా శిల్పి ఖండ కావ్యం, రంగాపురం గ్రామచరిత్ర, సమ్మక్క సారలమ్మ బతుకమ్మ పాట, తెలంగాణ తొలితరం చిత్రకారుడు మార్చాల రామాచార్యుల వ్యాస సంపుటి, అమరుడు కొండన్న, డాక్టర్ ముకురాల రామారెడ్డి సాహితీ సమీక్ష... ఇలా ఎంతో మంది లబ్ద ప్రతిష్ఠులైన వారిపై రచనలు, వ్యాసాలు రాసి ప్రజలను ఆలోచింపజేశారు.
స్వయంగా గీసి.. రాసి