తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షం వస్తే... ఈ ఊరు జలదిగ్బంధం అవుతుంది - యాదిరెడ్డిపల్లి గ్రామం సమస్యలు

వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంటోంది. చెరువులు నిండి అలుగులు పారినా.. భారీ వర్షాలు కురిసి వరద నీరు పోటెత్తినా.. ఆ గ్రామానికి రాకపోకలు బందే. రెండు చోట్ల వంతెనలు నిర్మిస్తే ఏటా వర్షాకాలంలో ఎదురయ్యే వరద కష్టాలకు చెక్ పెట్టొచ్చు. దశాబ్దాలుగా గ్రామ ప్రజలు వంతెన కోసం మొరపెట్టుకుంటున్నా... హామీలు తప్ప అమలు శూన్యంగానే మిగులుతోంది.

yadireddypally village
yadireddypally village

By

Published : Sep 18, 2020, 12:43 PM IST

వర్షం వస్తే... ఈ ఊరు జలదిగ్బంధం అవుతుంది

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని యాదిరెడ్డిపల్లి ప్రజలు.. వానాకాలం వచ్చిందంటే చాలు నానా అవస్థలు పడుతున్నారు. చెరువు నిండి అలుగుపారినా, ఎగువ నుంచి వరద వచ్చినా.. యాదిరెడిపల్లి- తాడూరు మధ్య వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆ గ్రామానికి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇంద్రకల్ చెరువు అలుగు పారి యాదిరెడ్డిపల్లికి వరదనీరు చేరే క్రమంలో యాదిరెడ్డిపల్లి- ఇంద్రకల్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

తప్పని అవస్థలు

ఈ రెండు అలుగులు ఒకేసారి పారినా... ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తినా... యాదిరెడ్డిపల్లి జల దిగ్బంధంలో చిక్కుకున్నట్లే! గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు మాత్రమే కష్టాలు ఉండేవి. కానీ ప్రస్తుతం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ రెండు చెరువులను నింపుతున్నారు. దీంతో మండల కేంద్రానికి వెళ్లాలంటే గ్రామస్థులకు అవస్థలు తప్పడంలేదు.

నిత్యం ప్రమాదాలు

యాదిరెడ్డిపల్లికి ఎగువన ఉన్న తుమ్మల సూగూరు, ఏటిదరిపల్లి, సిరిసనూరు, పాపగల్ గ్రామాల ప్రజలు తాడూరుకు వెళ్లాలంటే యాదిరెడ్డిపల్లి నుంచే వెళ్లాలి. చెరువు నిండి అలుగు పారితే.. ఆ గ్రామాలకు మండల కేంద్రానికి మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. గతంలో ఈ వాగులో కొట్టుకుపోయి కొంతమంది మృత్యువాత పడిన ఘనటలూ ఉన్నాయి. నిత్యం చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిధులివ్వండి

యాదిరెడ్డిపల్లి- తాడూరు, ఇంద్రకల్- యాదిరెడ్డిపల్లి మధ్య వంతెనల కోసం దశాబ్దాలుగా ప్రజలు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. వంతెనల నిర్మాణం కోసం రూ.1.60 కోట్లు వరకు వరకు ఖర్చవుతోందని.. ఆ నిధులు విడుదల చేయాలని కోరుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇటీవలే లేఖ రాశారు. ప్రస్తుతం ఈ సమస్య ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వీలైనంత త్వరగా ఆ నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

50 గ్రామాల్లో ఇదే పరిస్థితి

యాదిరెడ్డి పల్లి ఒక్కటే కాదు.. నాగర్ కర్నూల్ జిల్లాలో వాగులు పొంగడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడే గ్రామాలు 50కి పైగానే ఉన్నాయి. నాగనూలు, బొందలపల్లి, శ్రీపురం, బిజినెపల్లి ఇలా చాలాచోట్ల సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ఇప్పటికైనా జిల్లాలోని వంతెనల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి :కొవిడ్​ వల్ల కొండెక్కిన ధరలు.. కొనాలంటే 'గుడ్లు' తేలేస్తున్నారు!

ABOUT THE AUTHOR

...view details