కరోనా కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లక్షలాది మంది జీవన ఉపాధి కోల్పోయి, రోడ్డున పడ్డారు. పాఠశాలల మూసివేతతో విద్యా వాలంటీర్లు కూడా ఉపాధి కోల్పోయారు. గత 13 నెలలుగా పని లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కరోనా మొదటి దశను కట్టడి చేసేందుకు గత ఏడాది మార్చి 23 నుంచి లాక్డౌన్ అమలు చేసి పాఠశాలను మూసివేశారు. అప్పటి నుంచి విద్యా వాలంటీర్లు ఇంటికే పరిమితమయ్యారు.
రాష్ట్రంలో ఉన్న 12 వేల మంది విద్యా వాలంటీర్లకు ఉపాధి కోల్పోయారు. కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా మారింది. ప్రైవేట్ ఉపాధ్యాయులకు రెండు వేల రూపాయలతోపాటు 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఇచ్చి మాకు ఇవ్వకపోవడం ఏమిటి . మేమేం పాపం చేశాం.మమ్మల్ని ఉపయోగించకుని వదిలేశారు.
-కొత్తూరు అశోక్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా విద్యా వాలంటీర్ల సంఘం అధ్యక్షుడు
వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ ఉత్తర్వులు
నాగర్ కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 631 విద్యా వాలంటరీ పోస్టులు ఉన్నాయి. గత ఏడాది ఆరంభంలో కొంతమేర ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కావడంతో వాలంటీర్ల సంఖ్యను కుదించారు. ఉన్న వాలంటీర్లకు ఇప్పటి వరకు విధులు లేకపోవటంతో వేతనాలు చెల్లించడం లేదు. జిల్లాలో మొత్తం 952 పాఠశాలలు ఉన్నాయి. అందులో ఏకోపాధ్యాయ పాఠశాలు 174 ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అవసరమున్న చోట వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా విద్యా శాఖ.. ఉపాధ్యాయ ఖాళీలు ఉండి, వాలంటీర్ల నియామకం అవసరమైన పాఠశాలల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించింది.
ఉపాధ్యాయుడు లేకుంటే పాఠశాల మూతే
కాని ఇప్పటి వరకు వాలంటీర్ల నియామకం చేపట్టలేదు. దీంతో జిల్లాలో ఉన్న 174 ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెట్టిన ప్రతిసారి పాఠశాల మూతపడే అవకాశం ఉంది. ఈ పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమిస్తే విద్యార్థులు నష్టపోకుండా ఉంటారని చెబుతున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చెప్పేవారికి రూ. 18,000, ఆరు నుంచి 10వ తరగతి వరకు చెప్పేవారికి రూ. 21,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వాలంటీర్లకు ఎన్నో హామీలు ఇచ్చారని అవి అమలు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: KTR: 'దేశంలో రెండో హరిత విప్లవానికి తెలంగాణ నాంది'