రెండో తిరుపతిగా భావించే అలవేలుమంగ సమేత వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెంలో వెంకన్న స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. తిరుపతికి వెళ్లలేని నిరుపేదలు ఇక్కడి స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఈనెల 21 వరకు వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.
ఘనచరిత్ర కలిగిన ఆలయం
వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. గుడి-బడి అనే నానుడితో మొదలైన ఆలయ నిర్మాణం వేలాది మంది విద్యావేత్తలు, మేధావులను తీర్చిదిద్దిన ఘనత దీని సొంతం. గ్రామ నిర్మాత దివంగత తోటపల్లి సుబ్రహ్మణ్యశర్మ కృషి ఫలితంగా పాలెంలో 1962లో ఆలయ నిర్మాణం జరిగింది. స్థానికులైన రామలింగయ్య, బాలింగయ్యలు 13 ఎకరాల భూమిని విరాళంగా అందజేసి ఆలయ నిర్మాణానికి సహకారం అందించారు. స్వామివారి మూలవిరాట్టును తిరుపతిలోని పాపనాశి వద్ద, అలివేలు మంగమ్మ విగ్రహాన్ని రాయచోటిలో తయారు చేసి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు.
ఆలయ నిధులతో వెంకటేశ్వర డిగ్రీ కళాశాలను నిర్మించడంతో పాటు విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించారు. దేవాలయ ముఖ మండపం, ధర్మసత్రం, కోనేరు ఏర్పాటు చేశారు. 1976లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయాన్ని అధీనంలోకి తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో నిర్మించిన కల్యాణ మండపం ప్రారంభోత్సవానికి అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య హాజరయ్యారు. అలివేలు మంగమ్మ విగ్రహా ప్రతిష్ఠకు అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు.
పాలెంలో ఘనంగా వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు ఉత్సవాలు
ఈ ఆలయంలో వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈ నెల 14 నుంచి 21 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈనెల 14న నిత్యారాధన, తీర్థప్రసాద వితరణ, హంసవాహనసేవా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 16న అలివేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, 17న లక్ష పుష్పార్చన, 19న నిత్యారాధన, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, రాత్రి స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తారు. చివరి రోజైన 21న నిత్యారాధన, పూర్ణాహుతి, హోమం, చక్రస్నానం నివేదన కార్యక్రమాలతోపాటు ధ్వజారోహణం, పుష్పయాగము, తీర్థ ప్రసాద వితరణ, ఆకలింపు సేవా కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.