తెలంగాణ

telangana

ETV Bharat / state

మా డిమాండ్లు పరిష్కరించండి.. మీ పనులు చేసుకోండి..

ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన వారికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలంటూ నిర్వాసితులు ఆందోళన బాటపట్టారు. రోజురోజుకు ఆందోళన ఉద్ధృతం చేయడం వల్ల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపడుతున్న వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్​ పనులు నిలిచిపోయాయి.

మా డిమాండ్లు పరిష్కరించండి

By

Published : May 27, 2019, 11:15 AM IST

మా డిమాండ్లు పరిష్కరించండి.. మీ పనులు చేసుకోండి..

పాలమూరు రంగారెడ్డిలో నిర్మాణంలో ఉన్న వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ వద్ద గత 20 రోజులుగా భూ నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు. మల్లన్నసాగర్​ మాదిరిగా తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ జలాశయం నిర్మిస్తున్న మూడు ప్యాకేజీల కంపెనీల ముందు నిరసనకు దిగారు. దీనితో 25 నుంచి 30 కోట్లు విలువ చేసే పనులు నిలిచిపోయాయి.

జలాశయం నిర్మాణాన్ని మూడు ప్యాకేజీలుగా విభజించారు. తొమ్మిదో ప్యాకేజీ కింద పూర్తి చేయాల్సిన పనులను రూ.1380 కోట్లు, పదో ప్యాకేజీ కింద రూ.877కోట్లు, 11 ప్యాకేజీ కింద చేపట్టిన పనులకు రూ. 450 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు. ఇప్పటి వరకు 9, 11 ప్యాకేజీల్లో 30 శాతం పనులు పూర్తయ్యాయి. పదో ప్యాకేజీలో కేవలం ఐదుశాతం పని మాత్రమే జరిగింది. ఒప్పందం ప్రకారం నిర్మాణ పనులు ఈపాటికి చివరి దశకు చేరుకోవాల్సి ఉంది. కానీ భూసేకరణ నిధుల మంజూరు తదితర సమస్యల కారణంగా కొంత జాప్యం అయింది.

మద్దతుగా నిలిచిన నేతలు

తమకు ముందు నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని 11వ ప్యాకేజీ నిర్వాసితులు... గత 20 రోజులుగా ధర్నా చేస్తున్నారు. వారికి స్థానిక నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క , మాజీ ఎంపీ మల్లు రవి అండగా నిలిచారు. మల్లన్న సాగర్ తరహాలోనే తమకు వన్ టైమ్ సెటిల్మెంట్ చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. పనులతో విపరీతమైన దుమ్ము ధూళి వల్ల రకరకాల రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు.

ఎప్పటికి పూర్తవుతుందో..

నిర్వాసితుల ఆందోళనలతో గుత్తేదారులపై అదనపు భారం పడుతోంది. రోజు సుమారు 30లక్షల విలువైన పని నిలిచిపోతోంది. రిజర్వాయర్ నిర్మాణం నిరంతరాయంగా చేపట్టినా గడువు తేదీ నవంబర్ 2020 నాటికి నాటికి పూర్తి చేయడం అసాధ్యం. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపాలని గుత్తేదారులు కోరుతున్నారు.

చిన్న చిన్న కారణాలతో ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జాప్యం ఏర్పడుతోందని, తక్షణమే నిర్వాసితుల డిమాండ్లు పరిష్కరిస్తే బాగుటుందని ఇంజినీరింగ్​ అధికారులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్వాసితుల సమస్య పరిష్కరిస్తే రిజర్వాయర్​ పనులు వేగంగా పూర్తిచేసేందుకు అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: వాళ్లకో న్యాయం.. మాకో న్యాయమా..?

ABOUT THE AUTHOR

...view details