నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో.. వందేమాతరం ఫౌండేషన్ నిర్వహించే అక్షరవనం ఓ ప్రయోగశాల. మెరుగైన విద్యావిధానం కోసం వివిధ రకాల అంశాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఎన్నో వినూత్న విధానాలు అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మరో కొత్త పద్ధతిని అవలంభిస్తోంది. అక్కడ విద్యనభ్యసించే పిల్లలకు సాగును చదువులో భాగం చేసింది. రోజూ రెండు గంటల పాటు సాగు పాఠాల్ని స్వీయ అనుభవంతో నేర్చుకుంటున్నారు అక్కడి విద్యార్థులు. ఆరు నెలలుగా నిత్యం ఆహారానికి అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరల్ని సేంద్రియ విధానంలో పండిస్తున్నారు. పండించిన వాటిని తమ ఆహార అవసరాల కోసమే వినియోగిస్తున్నారు. పాలు పితకడం, సేంద్రియ ఎరువులు తయారు చేయడం, వెల్డింగ్ వంటి వృత్తులను చదువులో భాగంగా నేర్చుకుంటున్నారు.
ఓ సమస్య చూపించిన పరిష్కారం
అక్షర వనంలోని విద్యార్ధులు ఏడాదిలో 20రోజులు మాత్రమే తల్లిదండ్రుల వద్దకు వెళ్తారు. లాక్డౌన్ సమయంలో కూరగాయలు, ఆకుకూరల కోసం ఇబ్బందులు తలెత్తడం వల్ల సాగు పాఠాలకు శ్రీకారం చుట్టారు. పదో తరగతి.. ఆ పైబడి చదువుతున్న సీనియర్ విద్యార్థులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఓ ప్రధాన పంట అప్పగించారు. కేటాయించిన పంటకు అనుబంధంగా ఇతర పంటల్ని పండించవచ్చు. కావాల్సిన విత్తనాల్ని అక్షరవనం సమకూర్చుతుంది. పరికరాలు, సామాగ్రిని అందిస్తుంది. కొంత స్థలాన్ని కేటాయిస్తుంది. కేటాయించిన కూరగాయలు, ఆకుకూరల్ని ఎలా పండిస్తారు? సాగులో ఎలాంటి మెళకువలు పాటించాలి? చీడపీడలు ఆశిస్తే ఏమి చేయాలనేది ఇంటర్ నెట్, సామాజిక మాధ్యమాల్లో చూసి విద్యార్థులు నేర్చుకుంటారు.
సేంద్రియ ఎరువులతోనే సాగు..
అప్పగించిన ప్రధాన పంటపైనే పూర్తిస్థాయి దృష్టిసారించే సీనియర్లు... సాగు మెళకువల్ని జూనియర్లకు, తోటి మిత్రులకు నేర్పుతారు. అలా సుమారు 20కి పైగా కూరగాయలు, 10కి పైగా ఆకుకూరల్ని ప్రస్తుతం విద్యార్థులు తమకు కేటాయించిన చిన్నపాటి స్థలాల్లో సాగు చేస్తున్నారు. జీవామృతం, వేపనూనె, పశువుల ఎరువు లాంటి సేంద్రీయ ఎరువుల్ని మాత్రమే వాడతారు.
రండి.. రండి.. ఇది మేము పండించిన పంట
విద్యార్థులను సాగు దిశగా ప్రోత్సహించేందుకు నిర్వాహకులు వారికి క్రెడిట్ పాయింట్లు కేటాయించారు. సొంతంగా కూరగాయలు, ఆకుకూరల్ని పండించి వంటగదిలో అందిస్తే వారికి క్రెడిట్ పాయింట్లు ఇస్తారు. గిరాకి ఉన్న పంటను అందిస్తే.. వారికి ఎక్కువ పాయింట్లు, తక్కువగా అవసరం ఉండే వాటిని సాగుచేస్తే తక్కువ పాయింట్లు ఇస్తారు. తద్వారా అన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలు అందరు విద్యార్థులు పండించడంతో పాటు.. వారి ఆహార అవసరాలు తీరాలన్నది క్రెడిట్ పాయింట్ల ప్రధాన ఉద్దేశం. 8వేల క్రెడిట్ పాయింట్లు సాధిస్తే.. వారికి కూరగాయలు, ఆకుకూరల సాగుపై ఓ అవగాహన ఏర్పడినట్లు. అలా సాగులో పాయింట్లు సంపాదించేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. పండించడమే కాదు.. తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అక్షరవనానికి వస్తే తమ పొలాన్ని, పండించిన పంటను చూపిస్తూ మురిసిపోతున్నారు.
తెలియాలి కదా..!