మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభం కాగా... మొదట్లో మందకొడిగానే జనం పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. 8 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.
మధ్యాహ్నం 1 గంట సమయానికి మూడు మున్సిపాలిటీల్లో సగటున 60 శాతం పోలింగ్ నమోదైంది. నాగర్ కర్నూల్లో 51 శాతం, జడ్చర్లలో 46.67 శాతం, కొత్తూరులో 65.05 శాతం పోలింగ్ రికార్డైంది. కొవిడ్ నిబంధనలకు లోబడి మాస్కు ధరించిన ఓటర్లను మాత్రమే పోలింగ్ కేంద్రాలకు అనుమతి ఇచ్చారు. సిబ్బంది సైతం చేతికి గ్లౌస్లు, ముఖానికి మాస్కు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. అన్ని చోట్ల సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు. ఓటర్లకు ఉష్ణోగ్రత పరీక్షలు కూడా నిర్వహించారు.