రెండు పదుల వయస్సు వచ్చిందంటే నేటి యువత.. ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన నార్లకంటి జంగయ్య-రేణమ్మ దంపతులకు మాత్రం ఆ అదృష్టం దక్కలేదు. 20 ఏళ్లు దాటిన ఇద్దరు కుమారులను చంటిబిడ్డల్లా సాకాల్సిన దుస్థితి. అంతుచిక్కని వ్యాధితో ఐదేళ్ల నుంచి మంచానికై పరిమితమైన ఆ కుమారులను చూస్తూ ఆ తల్లిదండ్రులు బతుకీడిస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన నార్లకంటి జంగయ్య, రేణమ్మ దంపతులు కల్వకుర్తి పట్టణం వాసవీనగర్లో నివాసం ఉంటున్నారు. జంగయ్య ఆర్టీసీ కండక్టర్గా పని చేస్తున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. కుమారుల కంటే చిన్నదైన కుమార్తె వివాహం అయ్యింది.
ఐదేళ్ల వయసులో..
పుట్టిన నాటి నుంచి బాగానే ఉన్నా పెద్ద కుమారుడు కిట్టు ఐదేళ్ల వయస్సు వచ్చేసరికి కాళ్లు చేతుల్లో సత్తువను కోల్పోయి బలహీనంగా మారిపోయాడు. ఎంతో ఖర్చు చేసి, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా.. ఏం జరిగిందో వైద్యులు తేల్చలేకపోయారు. పెద్దకుమారుడి దెబ్బ నుంచి కోలుకోక ముందే ఆ కుటుంబానికి మరో ఆపద వచ్చింది.