Sarpanch Problems: ఊరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుండేది సర్పంచ్. గ్రామ అభివృద్ధి జరగాలన్నా.. ప్రజల బాగోగులు చూడాలన్నా.. ఇంటిపెద్దలా బాధ్యతను భుజాన వేసుకుంటాడు. ఆర్థిక వనరులను సృష్టిస్తూ... ఆదాయాన్ని రాబడుతూ... పల్లెను సొంత కుటుంబంలా కాపాడుకునే ప్రథమ పౌరుడి పరిస్థితి.. ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. అప్పులు తెచ్చి మరీ పూర్తిచేసిన అభివృద్ధి పనులకు సంబంధించి... బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ సర్పంచ్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన పంచాయతీలో పరిస్థితులను ప్రతిబింబిస్తోంది.
అప్పులు చేసి మరీ పనులు చేయిస్తే..: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామసర్పంచ్ గురువారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం శ్మశాన వాటిక, సీసీ రోడ్లు సహా పలు అభివృద్ధి పనులను సర్పంచ్ ఎల్లయ్య పూర్తి చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఈ పనులకు సంబంధించిన బిల్లులు మాత్రం ఇప్పటికీ రాలేదు. 2020 నుంచి 9 లక్షల వరకు ఖర్చు చేస్తే.. వడ్డీతో 11 లక్షలైందనీ అధికారులు మాత్రం బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని ఎల్లయ్య వాపోతున్నాడు.
"ఊరిలో స్మశాన వాటిక, రోడ్లు, డ్రైనేజీలు, ఇతర పనులు చేయించాం. వీటికి సంబంధించిన బిల్లులు రావట్లేదు. 11లక్షల అప్పు ఉంది. 9లక్షలు నాకు రావాల్సిన బిల్లులు ఉన్నాయి. 2020లో పనులు చేయించాను కానీ ఇంతవరకు బిల్లులు లేవు. ఊరిలో వడ్డీకి తీసుకొచ్చాను. వారు ఒత్తిడి చేస్తున్నారు. బిల్లులు ఇప్పుడు అప్పుడు వస్తాయంటూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. అందుకోసమే ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాను." -ఎల్లయ్య, అవుసలికుంట గ్రామసర్పంచ్