నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పుర ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున నాయకులు పట్టణాన్ని చుట్టేస్తున్నారు. రాష్ట్రంలో చేపట్టిన పలు సంక్షేమ పథకాలను వివరిస్తూ... దేశంలోనే నంబర్ 1గా సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అచ్చంపేట అభివృద్ధి గువ్వల బాలరాజుతోనే సాధ్యమన్నారు. గత ఎన్నికల మాదిరిగానే చరిత్ర పునరావృతం చేయాలని కోరారు. ఇతర పార్టీలకు ఓటు వేస్తే ఏం లాభం లేదని అభిప్రాయపడ్డారు.
అప్పుల రాష్ట్రం
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. పట్టణంలోని పలు వార్డుల్లో భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో కాంట్రాక్టర్లు, తెరాస నాయకులు, కేసీఆర్ కుటుంబం ప్రజల డబ్బును దోచుకున్నారని విమర్శించారు. వంద పడకల ఆస్పత్రి, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర అనేక మౌలిక వసతుల కోసం కేంద్రం రూ.వేల కోట్లను మంజూరు చేస్తే... తెరాస నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ఈసారి భాజపాను గెలిపిస్తే నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామన్నారు.