తెలంగాణ

telangana

ETV Bharat / state

Ramappa temple: రామప్పలో పర్యాటక వైభవం.. శిల్పకళను చూసి తన్మయత్వం.! - devotees rush in ramappa temple

ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వచ్చారు. ఆలయ శిల్పకళా నైపుణ్యాన్ని చూసి తన్మయత్వం పొందుతున్నారు.

ramappa
రామప్ప

By

Published : Aug 1, 2021, 1:45 PM IST

Updated : Aug 1, 2021, 2:03 PM IST

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడంతో ఆలయ విశిష్టతలు తెలుసుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో కాకతీయుల నాటి శిల్పకళా సంపద రామప్పకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ రోజు ఆదివారం కావడంతో ఆలయంలో రద్దీ మరింత పెరిగింది. క్యూలైన్లలో నిలబడి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.

రామప్పలో పర్యాటక సందడి

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడం.. మీడియా ద్వారా తెలుసుకున్నాం. కుటుంబసమేతంగా, మిత్రులతో కలిసి వచ్చాం. ఇక్కడకు వచ్చాక చాలా సంతోషంగా అనిపించింది. -రాజేశ్వరి, పర్యాటకురాలు

రామప్పకు స్నేహితులతో కలిసి వచ్చాను. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన భారత చారిత్రక నిర్మాణాల్లో రామప్ప 39వది కావడం గర్వకారణం. ఇక్కడ ఉన్న శిల్పసంపద చూసి చాలా ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ అయి ఉండి ఇన్ని రోజులు గుర్తించలేకపోయాం. ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మమత, హైదరాబాద్​

అబ్బురపడుతూ

రామప్ప దేవాలయానికి జులై 25న యునెస్కో గుర్తింపు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిగా ప్రపంచ వారసత్వ సంపదగా చోటు దక్కించుకున్న రామప్ప శిల్పకళా సంపదను చూసి పర్యాటకులు అబ్బురపడుతున్నారు. 8శతాబ్దాలకు పైగా చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాల ఆలయం రామప్ప.. కాకతీయ శిల్పకళా వైభవంతో విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని కాకతీయుల గణపతిదేవుని సేనాని రేచర్ల రుద్రయ్య నిర్మించినా.. శిల్పి రామప్ప పేరుతోనే వాడుకలో ఉంది. సాధారణంగా ఆలయాలన్నీ దేవుళ్ల పేరు మీద.. రాజుల పేరు మీద ఉంటే.. రామప్ప మాత్రం ఆ గుడికి రూపకల్పన చేసిన శిల్పి పేరు మీదనే ఉండటం ఆనాటి కాకతీయులకు శిల్పసంపద పట్ల ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది.

యునెస్కో ద్వారా రామప్ప గుర్తింపు పొందడం సంతోషంగా ఉంది. ఒడిశా నుంచి ఇక్కడకు వచ్చాం. రామప్ప మన దేశ సంస్కృతిని తెలియజేస్తోంది. సునీల్​, ఒడిశా

రామప్పకు యునెస్కో గుర్తింపు ఎప్పుడో రావాల్సింది అనిపించింది ఇక్కడకు వచ్చాక. ఇలాంటి అద్భుత కట్టడాలు మనదగ్గర ఉండటం గర్వంగా భావిస్తున్నాను. అరవింద్​, హైదరాబాద్​

ఇదీ చదవండి:Ramappa Temple : రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఎలా దక్కింది?

ఆలయానికి అసంఖ్యాకంగా తరలివచ్చిన హిందీ, తమిళ, కన్నడ, ఒడియా ప్రాంతాల పర్యాటకులు.. ఇక్కడి శిల్ప సౌందర్యాన్ని చూసి ఔరా అనకుండా ఉండలేకపోతున్నారు. ఎంతో ఆసక్తిగా ఆలయ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నారు. తెలుగు ప్రజలు తెలంగాణలో ఉండి కూడా ఇలాంటి అద్భుతాన్ని గుర్తించలేకపోయామని చెబుతున్నారు.

ఇదీ చదవండి:Revanth: మత సామరస్యానికి లాల్‌దర్వాజ బోనాలు ప్రతీక: రేవంత్‌రెడ్డి

Last Updated : Aug 1, 2021, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details