తెలంగాణ

telangana

ETV Bharat / state

TIGER: ఆ పెద్దపులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది

నాగర్​కర్నూల్​ జిల్లా నల్లమల అడవుల్లో సంచరించిన పెద్దపులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు జిల్లా అటవీశాఖ అధికారి వెల్లడించారు. ఇటీవల గాయపడిన పులి.. ప్రస్తుతం చురుగ్గా తయారైందని తెలిపారు.

By

Published : Jun 15, 2021, 11:21 AM IST

ఆ పెద్దపులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది
ఆ పెద్దపులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది

నాగర్​కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల అడవుల్లో సంచరిస్తూ జనాల కంటపడిన పెద్దపులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని నాగర్​కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ వెల్లడించారు. ఈ నెల 7న వటవర్లపల్లి సమీపంలోని రాసమొల్లబావి వద్ద నీటిమడుగులో పులి కనిపించగా.. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన అటవీ సిబ్బంది.. పులిని ఫొటోలు తీసి పరిశీలించారు. తలపై గాయం కనిపించగా.. కదలికలు సైతం నెమ్మదిగా ఉన్నాయి. అంతకుముందే వటవర్లపల్లిలో ఓ ఎద్దును చంపిందని, ఎద్దును వేటాడే క్రమంలో జరిగిన ఘర్షణలో పులికి గాయాలైనట్లుగా అధికారులు గుర్తించారు.

గాయాలైన మృగాన్ని బంధించి చికిత్స అందించేందుకు రెస్క్యూ బృందాన్ని సైతం హైదరాబాద్ నుంచి రప్పించారు. వేటాడిన ఎద్దు మాంసాన్నే ఎరగా వేసి.. బోను ఏర్పాటు చేశారు. వేటగాళ్లు విషం కలపకుండా 7,8,9 తేదిల్లో అక్కడే కాపలాగా ఉన్నారు. వయసు మీరిన మనుషులను వేటాడే ప్రమాదం ఉన్నందున చుట్టుపక్కల గ్రామాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ దండోరా సైతం వేయించారు. కానీ తీవ్రంగా గాయపడిన పులి మూడు రోజుల్లో చురుగ్గా తయారై దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని అటవీశాఖ అధికారి కిష్టాగౌడ్ వెల్లడించారు.

పెద్దపులిని టీ-2గా గుర్తించారు. దీని వయసు సుమారు 12 ఏళ్లు. 2013 నుంచి 2015 వరకు అమ్రాబాద్ నల్లమల అడవుల్లోనే సంచరించింది. తర్వాత నాగార్జునసాగర్ టైగర్ రిజర్వుకు వెళ్లింది. 2021 జనవరిలో తిరిగి అమ్రాబాద్ రిజర్వుకు చేరుకుని దోమలపెంట రేంజ్​లో సంచరిస్తోంది.

ఇదీ చూడండి: Tiger: వటవర్లపల్లిలో పెద్దపులి సంచారం

ABOUT THE AUTHOR

...view details