ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల దాకా నమోదవుతుండగా.. సాయంత్రం నాలుగు గంటలైనా ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. గురువారం లింగాల మండలం కొత్తకుంటపల్లికి చెందిన యల్లస్వామి (30) ఉపాధి పనులకు వెళ్లి వడదెబ్బతో మృతిచెందాడు. లాక్‌డౌనుతో పలురంగాల్లో ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్న కారణంగా.. గత నెల రోజులుగా ఉపాధి పనులకు వస్తున్న కూలీల సంఖ్య వేలల్లో పెరిగింది.
ఉపాధికి వడదెబ్బ... - వడదెబ్బ
రోజు రోజుకూ ముదురుతున్న ఎండలతో ఉపాధిహామీ కూలీలకు వడదెబ్బ ప్రమాదం పొంచి ఉంటోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికే అయిదారు మరణాలు నమోదైనందున కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
గ్రామీణ ఉపాధిహామీ శాఖ అధికారులు పనులకొచ్చే కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఈ ప్యాకెట్లకు కొరత లేకుండా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సైతం వైద్యఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
తాగునీరు వెంట తెచ్చుకుంటే కూలీకి రూ.5 అదనంగా ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధి పనుల సమయంలోనూ మార్పులు చేశామని చెబుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి పదింటి వరకే పనులు చేయాలని.. పూర్తికాకుంటే సాయంత్రం కూడా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. గతంలో ఇచ్చిన గుడారాలను విధిగా తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.