తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా గుప్పిట్లోకి పల్లెలు... అవగాహన రాహిత్యమే కారణం

పట్టణాల్లోనే కాదు పల్లెల్లో సైతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిబంధనలు పాటించాలని ఎంత చెబుతున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. పెళ్లిళ్లని, శుభ కార్యాలని గుమిగూడుతున్నారు. అలా మొదలైన కరోనా వ్యాప్తి...కుటుంబాలకు కుటుంబాలనే చుట్టేస్తోంది. వరసగా ప్రాణాలు తీస్తోంది. వలస వెళ్లిన వారు ఊళ్లకు తిరిగిరావటం, వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందటం లాంటి పరిణామాలతో పరిస్థితులు చేయిదాటిపోయాయి. కరోనా పరీక్షలూ చాలా తక్కువ జరుగుతున్నాయి. లక్షణాలున్న వాళ్లూ...భయాందోళనలతో పరీక్షలు చేయించు కోవటం లేదు. ఈ లోగా అందరికీ వైరస్ అంటుకుంటోంది.

corona spreading in villeges
కరోనా గుప్పిట్లోకి పల్లెలు

By

Published : May 11, 2021, 10:18 PM IST

కరోనా గుప్పిట్లోకి పల్లెలు

పల్లెలు కరోనా గుప్పిట్లోకి వెళ్తున్నాయి. వైరస్‌పై అవగాహన లేకపోవడం, లక్షణాలున్నా సరైన వైద్యం తీసుకోపోవడం వల్ల ప్రాణాల మీదకు వస్తోంది. మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కొన్ని ఊళ్లలో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలున్నాయి. మహారాష్ట్రతో సరిహద్దున ఉన్న గ్రామాలు, హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం నగరాలకు చుట్టూ ఉన్న పల్లెల్లో వ్యాప్తి ఉద్ధృతంగా ఉంటోంది.

ఉదాహరణకు... నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబడిపల్లి గ్రామం. ఏప్రిల్‌ 10 నుంచి అక్కడ కేసులు రావడం ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆ గ్రామంలో దాదాపు 125 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 5 గురు మృతి చెందారు. ఇంత చిన్న గ్రామంలో నెల వ్యవధి లోనే ఇంతలా కేసులు రావడం వల్ల గ్రామవాసులు వణికిపోతున్నారు. స్వచ్ఛంద లాక్‌డౌన్‌ కూడా విధించుకున్నారు. ఎందుకీ స్థాయిలో ఇక్కడ కేసులు నమోదయ్యాయంటే..? గ్రామంలో చాలా మంది పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. లాక్‌డౌన్‌ విధిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో...ఉగాదికి ఇంటికి వచ్చిన వారు ఇక్కడే ఉండిపోయారు. వీరి ద్వారానే వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చంటున్నారు వైద్యులు. అంబడిపల్లి పరిసర ప్రాంతాల్లో వేరుశనగ పంట బాగా పండుతుంది. ఈ పంట కొనుగోళ్ల కోసం మహారాష్ట్ర నుంచి వాహనాలు వస్తుంటాయి. వారి ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెంది ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటికి తోడు...పెళ్లిళ్లు, పేరంటాలు తదితర శుభకార్యాలు పెద్ద ఎత్తున నిర్వహించటమూ సమస్యలు తెచ్చి పెట్టింది.

అంబడిపల్లిలో ఎక్కువగా పాజిటివ్‌ కేసులు రోడ్ల పక్కనున్న షాపులు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలకే వస్తోంది. ఆ మార్గం గుండా వెళ్లే వారు...ఇక్కడ ఆగి ఏదో ఒక వస్తువు కొనుగోలు చేస్తుండటం వల్ల వారి నుంచి వ్యాప్తి చెందుతోంది. ఈ గ్రామంలో చనిపోయిన 5గురు..వృద్ధులే. వీరు లక్షణాలున్నప్పటికీ..కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోలేదు. అవగాహన రాహిత్యంతో .. మనకు ఏం అవుతుందిలే అన్న నిర్లక్ష్యంతో ఇంట్లోనే ఉన్నారు. తీరా...ఊపిరి తీసుకోవడం కష్టమైనప్పుడు.. పరిస్థితి విషమించాక ఆసుపత్రులకు వెళ్లారు. వీరే కాదు... ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ఉదాసీనతతోనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ముందస్తు చర్యలు తీసుకుంటే కరోనాను తరిమికొట్టొచ్చు:-

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే...కొత్తగుంటలో నెలలో 96 కేసులు నమోదయ్యాయి. ప్రధాన కారణం...ఈ గ్రామంలో 2పెద్ద ఫంక్షన్లు జరగటం. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం వల్ల వేడుక జరిగిన మరసటి రోజు నుంచి పాజిటివ్‌ కేసులు పెరిగాయి. అప్రమత్తమైన గ్రామస్థులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకున్నారు. ఊరంతా శానిటైజ్‌ చేశారు. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా..నిర్ధరణ పరీక్షలు చేసుకున్నారు. నిపుణుల సూచనలతో ఐసోలేషన్‌లో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవన్నీ పాటించటం వల్ల ప్రస్తుతం కొత్తగుంట గ్రామంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 2కి తగ్గిపోయింది. ఒకే మరణం నమోదైంది. కరోనా పల్లెల్ని కబళిస్తున్న తరుణంలో...ముందస్తు చర్యలు తీసుకుంటే కరోనాను తరిమికొట్టొచ్చని నిరూపించారు కొత్తగుంట గ్రామస్థులు.

గతంతో పోలిస్తే కరోనా పరీక్షల సంఖ్య తగ్గుతోంది. గ్రామాల పరిధిలోని పీహెచ్‌సీ, సబ్‌ పీహెచ్‌సీల్లో కిట్లు లేవు. కరోనా లక్షణాలున్నా అనుమానితులకు పరీక్షలు చేయడం లేదు. ఫలితంగా వారంతా మందుల షాపుల్లో ఔషధాలు కొనుక్కుని వినియోగిస్తున్నారు. కిట్లు లేకపోవటం వల్ల జ్వరంతో బాధపడేవారికి అందుబాటులోని పారాసిటమాల్‌ మాత్రలు ఇస్తున్నారు. 2, 3 రోజులు జ్వరం మాత్రలు మాత్రమే వినియోగిస్తున్న కొందరు..తర్వాత తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.

ఇదీ చదవండిఃరాష్ట్రంలో లాక్​డౌన్ 2.0... తాజా నిబంధనలు​ ఇవే..!

ABOUT THE AUTHOR

...view details