KTR Helps a Medical Student : పేదకుటుంబంలో పుట్టిన ఆ చదువుల తల్లి కష్టపడి చదివి నీట్‌లో తన ప్రతిభ చూపింది. మంచి వైద్య కళాశాలలో సీటు సంపాదించింది. అయినా ఆర్థిక సమస్యల వల్ల ముందుకెళ్లలేని పరిస్థితి. తన కలను నెరవేర్చుకోలేని దుస్థితి. ఈ విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి ఆమె గురించి ట్విటర్‌లో కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లాడు. ట్విటర్‌లో ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే మంత్రి కేటీఆర్ ఈ విషయంపై తక్షణమే స్పందించారు. కేటీఆర్‌తో పాటు పలువురు మంత్రులు కూడా ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. మరికొంత మంది ఆన్‌లైన్‌లో నగదు పంపిస్తూ తమకు చేతనైనంత సాయం చేస్తున్నారు.
వైద్య విద్యార్థిని చదువుకు రాష్ట్ర మంత్రుల భరోసా - వైద్య విద్యార్థిని కేటీఆర్ సాయం
KTR Helps a Medical Student : వైద్య సీటొచ్చినా పేదరికం కారణంగా ఇబ్బందులు పడుతున్న ఓ విద్యార్థినికి రాష్ట్ర మంత్రులు అండగా ఉంటామన్నారు. మరికొందరు దాతలు ఆన్‌లైన్‌లో కొంత నగదును పంపించారు. ‘మెడికల్ సీటొచ్చినా గుదిబండలా పేదరికం!’ శీర్షికతో ‘ఈనాడు’ ప్రధాన సంచికలో గురువారం ప్రచురితమైన కథనానికి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు పలువురు స్పందించారు.

KTR Tweet Today : నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూరు గ్రామానికి చెందిన కొమ్ము సింధూరకు పైవేటు వైద్య కళాశాలలో సీటు వచ్చినా ఆర్థిక సమస్యలతో సతమతమవుతోందని ప్రచురితమైన కథనాన్ని ఓ నెటిజన్, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేయగా ఆయన స్పందించారు. సింధూర విద్య బాగోగులు వ్యక్తిగతంగా చూసుకుంటానని, సంబంధిత కళాశాలతో సమన్వయం చేస్తానని ట్వీట్ చేశారు. సింధూర మేనమామతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి మాట్లాడి వివరాలు తీసుకున్నారు. అలాగే మరో మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో అధికారులు సింధూర వ్యక్తిగత, ఆర్థిక వివరాలను సేకరించారు. జిల్లా కలెక్టర్ ఉదయ్‌కుమార్ స్వయంగా తనతో మాట్లాడి అండగా ఉంటామని, వైద్య విద్యను కొనసాగించాలని సూచించినట్లు సింధూర ‘న్యూస్‌టుడే’కు తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పలువురు వైద్యులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రవాస భారతీయులు సింధూర వివరాలు తెలుసుకున్నారు. గురువారం రాత్రి 8 వరకు ఆన్‌లైన్ ద్వారా పది మంది రూ.49 వేల సాయం అందజేశారని సింధూర కుటుంబసభ్యులు తెలిపారు.
సింధూర తండ్రి వెంకటయ్య ఓ కంపెనీలో వాచ్‌మన్. తల్లి అలివేలు కార్మికురాలు.. తమ్ముడు దివ్యాంగుడు.. ఇంటి నిండా ఆర్థిక సమస్యలున్నా సింధూరకు చదువుపై ఉన్న శ్రద్ధను గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించారు. అలా పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువు కొనసాగించిన సింధూర.. రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డి గురుకుల విద్యాలయంలో 923 మార్కులతో ఇంటర్ పూర్తిచేసింది. నీట్లో 451 ర్యాంకు సాధించగా ఇటీవలి కౌన్సెలింగ్‌లో మహబూబ్‌నగర్ ఎస్వీఎస్ కళాశాలలో సీటు లభించింది. ఈ క్రమంలో కళాశాల ఫీజు రూ.60వేలు, వసతి గృహం ఫీజు రూ.లక్షతో పాటు లైబ్రరీ డిపాజిట్ తదితరాలకు రూ.1.15 లక్షల వరకు అప్పు చేసి చెల్లించారు. ఇక కళాశాలలో అయిదున్నరేళ్ల కోర్సుతో పాటు శిక్షణ పూర్తిచేసేందుకు, పుస్తకాలకు అవసరమైన డబ్బు లేక ఆపన్నహస్తం కోసం సింధూర ఎదురుచూస్తోంది. డాక్టర్‌నయి పేదలకు సేవలందించడమే లక్ష్యమంటున్న ఈ ప్రతిభావని దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది.
- ఈ విద్యార్థినికి సాయం చేయాలనుకునే వారు 99515 41940 (మల్లేశ్) నంబర్‌ను సంప్రదించగలరు.