తెలంగాణ

telangana

ETV Bharat / state

Alternative Crops : ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతుల ఆలోచన - what are Alternative crops

Alternative Crops : యాసంగిలో వరి వేయొద్దన్న సీఎం సూచనలతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల వైపుగా రైతులు ఆలోచన చేస్తున్నారు. చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, పప్పుధాన్యాల వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే విత్తనాలు, మద్దతు ధరపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం భరోసా కల్పిస్తే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపే అవకాశం ఉంది.

Alternative crops in telangana
Alternative crops in telangana

By

Published : Dec 12, 2021, 7:02 AM IST

Alternative Crops : యాసంగిలో వరి మానేసి ఇతర పంటలను సాగు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ మాటలు రైతుల్లో ఆలోచన రేకెత్తిస్తున్నా ప్రత్యామ్నాయ పంటల విషయంలో వారికి అనేక సందేహాలు నివృత్తి కావాల్సి ఉంది. విత్తనాల లభ్యత, మార్కెటింగ్‌.. ఇలా పలు అంశాలపై ప్రభుత్వం వారికి భరోసా కల్పించాల్సి ఉంది. ‘ఈనాడు’ పలు గ్రామాలను సందర్శించి.. ప్రత్యామ్నాయ పంటల సాగు ఎలా ఉంటుంది, లాభదాయకమేనా అని కొందరిని అడిగితే జాగ్రత్తగా చేసుకుంటే వరికంటే లాభదాయకం కావచ్చేమోనని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇతర పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, వాటిని పండించాక అమ్ముకునే విషయంలో మాత్రం ప్రభుత్వ సాయం కోరుతున్నారు. ముఖ్యంగా కోతుల బెడద చాలామందిని భయపెడుతోంది. గతంలో సాగునీరు అందుబాటులో లేనప్పుడు వరికి బదులు ఇతర పంటలు సాగుచేసిన విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు. ఈ యాసంగిలో వరి సాగు విస్తీర్ణం చాలామేరకు తగ్గే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ భావిస్తోంది. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై మారుమూల గ్రామాల్లో కూడా చర్చ జరుగుతోంది. ‘ఈనాడు’తో వారు పంచుకున్న అనుభవాలివి..

పంట మార్పిడికి ఇలా సహకరించాలంటున్న రైతులు

  • Yasangi Crops : ‘ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల’ (ప్యాక్స్‌)లో విత్తనాలను విక్రయించాలి.
  • ప్రభుత్వం తరఫున రాయితీ విత్తనాల అమ్మకాలు లేక ప్రైవేటు కంపెనీలు వాటి ధరలను పెంచేశాయి. గత మే, జూన్‌లో క్వింటా వేరుసెనగ విత్తనాలను రూ. 12,500 నుంచి 18,000కు పెంచడంతో భారంగా మారింది.
  • నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆవాలు వంటి పంటలకు మార్కెట్‌లో మంచి ధరలున్నాయి. అధిక దిగుబడినిచ్చే వాటి వంగడాలు గ్రామాల్లో దొరకడం లేదు. వాటిని వ్యవసాయశాఖ విక్రయించాలి.
  • కొర్రలు, సామలు, ఊదలు, అరిగెల వంటి చిరుధాన్యాలు పండించాలని ప్రైవేటు కంపెనీలు, వ్యాపారులు అడుగుతున్నారు. కానీ ఈ పంటలు సాగుచేయడానికి విత్తనాల కొరత ఉంది. పండించాక శుద్ధికి, మర పట్టించడానికి గ్రామాల్లో ఎక్కడా మిల్లులు లేకపోవడంతో సరైన ధరలు రావడం లేదు. మండలానికో మిల్లు అయినా ఏర్పాటు చేయిస్తే వీటి సాగు విస్తీర్ణం బాగా పెరుగుతుంది.
  • వరికి నాటు యంత్రాలు, కోత యంత్రాలున్నట్లే ఇతర పంటలకూ యంత్రాలు గ్రామాల్లో అద్దెకిచ్చేలా సర్వీసు కేంద్రాలు పెడితే మేలు.
  • ధాన్యాన్ని మద్దతు ధరకు కొన్నట్లే ఇతర పంటలనూ వ్యవసాయ మార్కెట్లలో కొంటామని ప్రభుత్వం హామీ ఇస్తే బాగుంటుంది.

కూరగాయలు, పప్పు ధాన్యాల సాగు మేలు

"రాష్ట్రంలో కూరగాయలు, పండ్లు, వంటనూనెలు, పప్పుధాన్యాలకు తీవ్ర కొరత ఉంది. వాటిని సాగుచేస్తే మంచి లాభాలొస్తాయి. ఈ యాసంగిలో వేరుసెనగ, మినుము వంటి పంటల సాగును బాగా ప్రోత్సహిస్తున్నాం. హైదరాబాద్‌ నగరానికి చుట్టూ ఉన్న జిల్లాల్లో కూరగాయల సాగు ప్రోత్సహించాలని ఉద్యానశాఖను ఆదేశించాం. శ్రీగంధం చెట్లు పెంచితే దీర్ఘకాలంలో మంచి ఆదాయం వస్తుంది. ఈ యాసంగిలో పప్పు ధాన్యాలు, నూనెగింజలను సాగుచేస్తే లాభాలు వస్తాయని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ పరిశోధనా విభాగం అధ్యయనంలో తేలింది. పంటల మార్పిడి వైపు రైతులను పెద్దయెత్తున ప్రోత్సహిస్తున్నాం."

- వ్యవసాయ, ఉద్యానశాఖల మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి

విత్తనాల కోసం తిరుగుతున్నా

"గత జూన్‌లో ఐదెకరాల్లో వరి సాగుచేశాను. ఈ యాసంగిలోనూ వరే వేయాలనుకున్నా. కానీ సీఎం కేసీఆర్‌ వద్దని చెప్పడంతో మానేశాను. పొద్దుతిరుగుడు సాగుచేయాలని అయిదెకరాలను దున్ని సిద్ధం చేసినా నాణ్యమైన విత్తనాలు దొరకడం లేదు. ప్రభుత్వం వాటిని ఇప్పిస్తే ఎంతో ఉపయోగం. మూడేళ్ల క్రితం పొద్దుతిరుగుడు వేస్తే లాభమొచ్చింది. కానీ నీళ్లున్నాయని వరి సాగు మొదలుపెట్టాను అంతే."

- చిమ్ముల శ్రీనివాసరెడ్డితుమ్మపల్లి గ్రామం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

క్వింటా పల్లీ విత్తనాలు రూ.18 వేలకు కొన్నా

"నాకున్న 4 ఎకరాల్లో వరి మానేసి వేరుసెనగ, కంది. జొన్న సాగుచేశాను. వేరుసెనగ విత్తనాలు ప్రైవేటు కంపెనీ నుంచి క్వింటా రూ.18 వేలకు కొన్నా. ధర చాలా ఎక్కువే. ప్రభుత్వమే వాటిని తక్కువ ధరకు ఇప్పిస్తే ప్రయోజనం ఉండేది. సామలు, ఊదలు, కొర్రలు వంటి చిరుధాన్యాలు సాగుచేయాలనుకున్నా నాణ్యమైన విత్తనాలు దొరకడం లేదు. మిల్లులు కూడా లేవు. ప్రభుత్వం ఈ పంటలకు మద్దతు ధర ప్రకటించాలి."

- ఎన్‌.రఘుపతిరెడ్డి వేరుసెనగ రైతు, వంగూరు గ్రామం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

టమాటా సాగుతో ఎకరానికి రూ.లక్ష ఆదాయం వచ్చింది

"నాకున్న 3 ఎకరాల్లో టమాటా సాగుచేశాను. ఎకరానికి రూ.25 వేల దాకా పెట్టుబడి పెట్టాను. వరి సాగుచేసినా అంతే అవుతుంది. కానీ వరిధాన్యం అమ్ముకోవాలంటే ఎన్నో తిప్పలు. టమాటా ధరలు బాగుండటంతో ఎకరానికి రూ.లక్ష దాకా ఆదాయమొచ్చింది. కూరగాయల సాగుతో ప్రతి సీజన్‌లో లాభాలొస్తాయి. వరికన్నా వీటి సాగు ఎంతో మేలని నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది."

- మల్లేశ్‌, రైతు, నాగులపల్లి గ్రామం, రంగారెడ్డి జిల్లా

నల్లరేగడి భూముల్లో సాగుకు సలహాలివ్వాలి

"నాకు ఎకరంన్నర పొలం ఉంది. వానాకాలంలో వరి సాగుచేశాను. ఇప్పుడు యాసంగిలో వరి వద్దంటున్నారు. నల్లరేగడి భూమి మాది. డిండి రిజర్వాయర్‌ వల్ల తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా భూమిలో ప్రత్యామ్నాయ పంట విత్తనాలిచ్చి సాగుకు సలహాలిస్తే వేస్తాం. మా తండా రైతులంతా ఇతర పంటల గురించే ఆలోచిస్తున్నారు."

మమత, రైతు, బొగ్గులదోన తండా, నల్గొండ జిల్లా

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details