తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్షరవనం.. భవిష్యత్తు భరోసామయం.. - అక్షరవనంలో విద్యార్థుల వంట

పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ప్రతి పనీ ఎవరో ఒకరు చేయాల్సిందే. చదువుకునే పిల్లలకైతే అమ్మో, నాన్నో, సొంతోళ్లు ఎవరో ఒకరు లేకుంటే పూటైనా గడవదు. కానీ ఈ పిల్లలు అలా కాదు. వారి పని వాళ్లే చేసుకుంటారు. అంతేనా... అక్కడున్న వారందరికీ వండి వడ్డిస్తారు. ఇంతకీ ఆ పిల్లలు ఎవరు? ఎక్కడున్నారో తెలుసుకోవాలనుందా? ఐతే అక్షరవనానికి వెళ్లాల్సిందే...

teaching in different way at kalwakurthy aksharavanam
అక్షరవనం.. భవిష్యత్తు భరోసామయం..

By

Published : Mar 10, 2020, 9:03 AM IST

అక్కడ చదువొక్కటే కాదు వంటావార్పూ నేర్పిస్తారు. యోగా, వ్యాయామం, నృత్యాలు, ఆట-పాటలు అన్నీ ఆ విద్యార్థుల దినచర్యలో భాగమే. అదే నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి శివారులోని అక్షరవనం. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినూత్న విద్యాబోధన చేస్తున్నారు. కలాం-100 పేరిట నడుస్తున్న కార్యక్రమంలో భాగంగా 60 మంది పిల్లలు అక్కడ విద్యనభ్యసిస్తున్నారు. వారికి విద్య, వసతి, భోజనం అన్నీ ఉచితమే. అక్కడ సీనియర్లే గురువులు.

ఒక్కో బృందం ఒక్కో పని

అక్షరవనంలో విద్యార్థులు ఎవరి పనివారే చేసుకుంటారు. వంట కూడా విద్యార్థులే చేస్తారు. అందుకోసం బృందాలుగా ఏర్పడి పని విభజన చేసుకొని పూర్తి చేస్తారు. పాత్రలు శుభ్రం చేసేందుకు ఓ బృందం. సరుకులు తూకం వేసే బాధ్యత మరో బృందానిది. కూరగాయలు ఓ బృందం కోస్తే... వాటిని వండటం ఇంకో బృందం పని. ఇలా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం విద్యార్థులే వండి వారుస్తారు.

అంతా లెక్క ప్రకారమే..

వంట చేసేందుకు అక్షరవనంలో ప్రత్యేక మెనూ ఉంటుంది. ఏ వంటకు ఏ వస్తువులు ఎంత పరిమాణంలో జాబితా సిద్ధంగా ఉంటుంది. ఉదాహరణకు ఒకరికి సరిపోయే పప్పుకూర చేయాలంటే కావాల్సిన వస్తువుల జాబితా సిద్ధంగా ఉంటుంది. దాని ప్రకారం ఎంత మందికి వంట చేయాలో హెచ్చించి వండుతారు. ఎంతమందికి కావాలో రెండు గంటల ముందు చెబితే సిద్ధం చేస్తారు. అలా అని రోజు అవే వంటలో, ఒకటి రెండు రకాలో కాదు. రోజుకో వెరైటీ అల్పాహారం, భోజనంలో కూర, చారు, పచ్చడి, పెరుగు ఇలా

పనిలో పోటీ..

ఇలా ఒక బృంద సభ్యులు వండితే మరో బృందం వడ్డించే ఏర్పాట్లు చూస్తుంది. ఇంకో బృందం శుభ్రం చేస్తారు. అలా విద్యార్థులే వండుకుని, తిని, శుభ్రం చేసుకుంటారు. కావాల్సినంత తినొచ్చు కానీ ఒక్క మెతుక్కూడా వృథా చేయొద్దనేది అక్కడి నియమం. అలా అని చదువునేం నిర్లక్ష్యం చేయరు. నెలలో ఏదో ఒక వారం పిల్లలే స్వచ్ఛందంగా ఎంచుకుంటారు. చేసే పని కూడా చాలా ఇష్టపడి, పోటీపడి చేస్తుండటం గమానార్హం.

జీవన నైపుణ్యం..

ప్రతి చిన్న పనికి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులపై ఆధారపడే పిల్లలున్న ఈ రోజుల్లో ఎవరి పనులు వారు చేసుకోవడం తమలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోందని విద్యార్థులు అంటున్నారు. చదువుకుంటునే ఇతర పనులు నేర్చుకోవడం తమ కాళ్ల మీద తాము నిలబడగలమన్న నమ్మకం కలుగుతోందంటున్నారు. అక్షరవనాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో అతిథులు వస్తుంటారు. వారికి వండి వడ్డించేదీ ఈ బాలభీములే...

పిల్లలంటే బడే లోకమని భావిస్తున్న నేటి సమాజంలో.. ఆత్మస్థైర్యాన్ని నింపే నైపుణ్యాలు నేర్పుతూ.. జీవిత పాఠాలు పరిచయం చేస్తూ... అక్షరవనం చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. నేటి సమాజానికి అనుసరణీయం కూడా.

అక్షరవనం.. భవిష్యత్తు భరోసామయం..

ఇవీ చూడండి:తండ్రిని కడసారి చూడకుండానే వెనుదిరిగిన అమృత

ABOUT THE AUTHOR

...view details