నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో యువత, విద్యార్థులు స్వామి వివేకానందుడు చూపిన బాటలో నడుస్తున్నారు. ఇతరుల పట్ల సేవా భావాన్ని అలవర్చుకోవాలని ఆయన ఇచ్చిన సందేశాన్ని తు.చ. తప్పక పాటిస్తున్నారు. స్వామి వివేకానంద సేవా బృందం పేరిట సందర్భానుసారం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఐదేళ్ల క్రితం పాఠశాల స్థాయిలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసుకున్న ఈ బృందం ఇతర ప్రాంతాల్లో కూడా తమకు తోచిన సాయం అందిస్తున్నారు. ఓ వైపు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే... సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం...
సేవా కార్యక్రమాల్లో చురుకుగా...
వివేకానంద సేవా బృందంలో పాఠశాల విద్యార్థులు, స్థానిక యువత సభ్యులుగా ఉన్నారు. తల్లిదండ్రులు తమకు ఇచ్చిన పాకెట్ మనీని విద్యార్థులు సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు. వసతి లేని పేద విద్యార్థులను గుర్తించి వారిని ఆదుకుంటున్నారు. తమ కాలనీలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టి... వాటిని శుభ్రపరుస్తారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించేలా చూస్తున్నారు.