నాగర్ కర్నూల్ జిల్లా ఊపిరి పీల్చుకుంటోంది. కరోనా పాజిటివ్ కేసులు కొత్తవి నమోదు కాకపోగా.. పరీక్షలకు పంపిన 86 నమూనాల్లో 83 మందికి కరోనా లేదని తేలడం వల్ల కందనూలు కాస్త ఉపశమనం పొందింది. దిల్లీలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని 11 మందిని గుర్తించిన అధికార యంత్రాంగం వారికి పరీక్షలు జరపగా కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ ఉన్నట్లుగా తేలింది. ఆ ఇద్దరూ ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతుండగా.. వారి ప్రైమరీ కాంటాక్ట్స్ 39 మందిని ఉయ్యాలవాడలోని ప్రభుత్వ క్వారంటైన్లో ఉంచారు.
తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి క్వారంటైన్లో ఉన్న 9 మందిని, కల్వకుర్తి క్వారంటైన్లో ఉన్న 25 మందికి కారోనా నెగిటివ్ వచ్చినందున వారిని ప్రభుత్వ క్వారంటైన్ నుంచి హోమ్ క్వారంటైన్‌కు నాగర్‌కర్నూల్ ఆర్డీఓ నాగలక్ష్మి తరలించారు. వారి చేతులపై ప్రత్యేక స్టాంపులు వేసి 21 రోజులపాటు ఇంటి నిర్బంధంలోనే ఉంటామని వారి నుంచి లిఖిత పూర్వక వాగ్మూలం తీసుకుని ఇళ్లకు తరలించారు.