నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ అసలు పేరు.. నంది వర్ధమానపురం. జైన మత తీర్ధంకురుడు వర్దమాన మహవీరుడు ఆ ప్రాంతానికి రావడంతో వర్ధమానపురమని పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఎక్కడ తవ్వినా నందులే బైటపడటం, నందీశ్వరుని ఆలయం ఉండటంతో... నంది వర్థమానపురంగా పేరుగాంచిందని తెలుస్తోంది. ఒకప్పుడు ఈ గ్రామం మహాదుర్గం. చుట్టూ కోటగోడ, కందకం ఆనవాళ్లు.. నేటికీ దర్శనమిస్తాయి. బాదామి చాళుక్యులు, కళ్యాణిచాళుక్యులు, కందూరు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్నిపాలించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయిది. గణపతిదేవుని సామంతరాజు భీమచోళుడు... ఈ ప్రాంతాన్ని పరిపాలించడంతో ఇక్కడి చెరువుని భీమసముద్రంగా పిలుస్తారు. రుద్రదేవుని కాలంలో కాకతీయులకు పడమటి రాజధాని. గోనబుద్ధారెడ్డి, గోనగన్నారెడ్డి సహా పలువురు గోన వంశస్తులు వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు.
ఆకట్టుకునే చారిత్రక ఆలయాలు..
ఎన్నో చారిత్రక ఆలయాలు... వర్ధమానపురంలో కొలువుదీరాయి. వాటిలో అతిపురాతమైనది నందీశ్వర ఆలయం. అతిపెద్ద నంది.. ఇక్కడి గుడికి ప్రత్యేక ఆకర్షణ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆలయాలుగా చెబుతున్న త్రికూట ఆలయాలు... అద్భుతమైన శిల్పకళకు కేంద్రాలు. పటమటి దిక్కున ఉన్న వీరభద్రుని కోవేలలోని వీరభద్రుని విగ్రహ రూపం భక్తులను కట్టిపడేస్తుంది. ఆ గుడికి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం ఉంటుంది. దొంతుల గౌరమ్మ గుడి సైతం.. చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఊరి చివరన భద్రకాళి ఆలయంగా చెబుతున్న పురాతన గుడి చూపరులను ఆకట్టుకుంటుంది. గ్రామంలో 2వేల సంవత్సరంలో నిర్మించిన శనీశ్వరుని ఆలయం రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచింది. రాష్ట్రం నలమూలల నుంచి అక్కడి శనీశ్వరుని దర్శనానికి వస్తుంటారు.