Savera Minority Welfare Association : మహాశివరాత్రిని పురస్కరించుకొని.. ఆ శివయ్యను దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు కాలినడకన వెళ్తుంటారు. వారిలో శివస్వాములు, భక్తులు ఉంటారు. వీరంతా వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం మల్లన్న దర్శన భాగ్యం కోసం వెళ్తుంటారు. అయితే మార్గమధ్యలో వారికి ఉడతభక్తి సాయం చేస్తూ... సవేరా మైనార్టీ అసోసియేషన్ నిర్వాహకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎండనపడి వచ్చిన వారికి మంచినీళ్లు, పండ్లు, ఫలహారం అందిస్తూ... సేవాగుణం చాటుకుంటున్నారు. మానవ సేవే-మాధవ సేవ అని అంటున్నారు.
జిల్లాకేంద్రానికి చెందిన పదిమంది కలిసి... శివరాత్రి సందర్భంగా శ్రీశైలం దర్శనానికి పాదయాత్రగా తరలివెళ్తున్న శివ స్వాములు, భక్తులకు సాయం చేస్తున్నారు. ప్రధాన రహదారి వెంబడి వేలాది మంది భక్తులు... హైదరాబాద్, మహబూబ్‌నగర్, కర్నూల్ ఇతర రాష్ట్రాల నుంచి రోజుల తరబడి పాదయాత్రలు చేస్తారు. వారు కాస్త డబ్బును కూడబెట్టి... సిండికేట్‌గా సాయం చేస్తున్నారు. స్వాములు, భక్తులకు ఉదయం వేళ టీ,టిఫిన్(ఇడ్లీ, వడ, మైసూర్ బజ్జి) ఫలహారాలు, పాలను అందిస్తున్నారు. మధ్యాహ్నం వేళ పండ్లు (అరటి, సపోటా, కలంగిరి, జామ, బత్తాయి), మజ్జిగ, కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు. సాయంత్రం వేళ స్నాక్స్ అందజేసి వారికున్నా సేవా గుణాన్ని చాటుతున్నారు.
నాగర్ కర్నూల్లో ఐదేళ్ల నుంచి సవేరా మైనార్టీ వెల్పేర్ అసోసియేషన్ శివస్వాములకు సేవలు చేస్తోంది. ఇక్కడ ఏటా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తాం. కొందరు దాతలు కూడా మాకు అండగా ఉంటున్నారు. కాలినడకన వచ్చే శివస్వాములకు కలిగే ఇబ్బందులు చూసి... మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కులమతాలకు అతీతంగా...మనుషలందరం ఒక్కటే అనే వ్యాక్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం.
-అసోసియేషన్ నిర్వాహకులు
శివభక్తులకు ముస్లింల సాయం
జిల్లా కేంద్రంలోని సవేరా మైనార్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివ భక్తులకు ఎంతో కొంత సేవ చేస్తున్నారు. కాలినడకన వెళ్తూ... వివిధ ఆరోగ్యసమస్యలతో బాధపడేవారికి అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నారు. హిందూ-ముస్లింలు అనే తేడా లేకుండా ఈ సేవలు చేస్తున్నారు. గత ఆరేళ్లుగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నామని... శివ భక్తులకు సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ముస్లిం యువకులు... శివభక్తులకు సేవలు చేయడం చాలా సంతోషంగా ఉందని శివ భక్తులు తమ ఆనందాన్ని వెలిబుచ్చుతున్నారు.