తెలంగాణ

telangana

ETV Bharat / state

'గౌడ కులస్తుల సమస్యలు పరిష్కరించాలి'

రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా గౌడ కులస్తుల సమస్యలు పరిష్కారం కాలేదని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం సభ్యులు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లో కల్లు గీత కార్మికుల ఆత్మగౌరవ యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు.

sarvai papanna moku debba gouda sangam padayathra in nagar karnool district
'గౌడ కులస్తుల సమస్యలు పరిష్కరించాలి'

By

Published : Dec 26, 2020, 8:03 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లో గౌడ కులస్తులు కల్లు గీత కార్మికుల ఆత్మగౌరవ యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. మాధవస్వామి ఆలయం నుంచి పోలీస్ స్టేషన్ చౌరస్తా మీదుగా పాదయాత్ర సాగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పలు డిమాండ్లపై తహసీల్దార్​కి వినతిపత్రం అందజేశారు. అనంతరం స్థానిక మహబూబ్ ఫంక్షన్ హల్​లో సమావేశం నిర్వహించారు. గౌడ కులస్తుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం అధ్యక్షుడు జక్క వీరస్వామి గౌడ్ అన్నారు. ప్రతి గ్రామంలో జీవో నంబర్​ 560 ప్రకారం ప్రతి గ్రామ గౌడ సొసైటీకి 10 ఎకరాల భూమిని కేటాయించాలని, ఔషధ గుణాలున్న కల్లును నీరగా అభివృద్ధి చేసి నిల్వచేసి ప్రభుత్వమే బాటిలింగ్ చేసి అమ్మాలని డిమాండ్ చేశారు.

చెట్టు మీది నుంచి కింద పడి చనిపోయిన గీతకార్మికునికి రూ.10 లక్షలు, శాశ్వత వికలాంగుడికి రూ. 5 లక్షలు, దెబ్బలు తగిలిన కార్మికుడికి రూ. 3లక్షలు, ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 నెలల్లో ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. ప్రతి గీత కార్మికుడికి పూర్తి సబ్సిడీపై ద్విచక్ర వాహనాన్ని అందించాలని, కల్లు ద్వారా చక్కెర బెల్లం, చాక్లెట్, తాటి తాండ్ర యూనిట్లు ఏర్పాటు చేసి గౌడ కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. వెంటనే గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 5000 కోట్ల బడ్జెట్​ కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్​లో గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

'గౌడ కులస్తుల సమస్యలు పరిష్కరించాలి'

ఇదీ చదవండి:గొర్రెల లొల్లి: పంచాయతీ పెట్టి మరీ కొట్టుకున్నారు

ABOUT THE AUTHOR

...view details