తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగర్​కర్నూల్​ జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దందా...

ఇసుక దొరకడం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు.. మరోవైపు ఇసుక పుష్కలంగా ఉందని.. అధికారులకు దరఖాస్తు చేసుకుంటే చాలు అనుమతులిస్తామని అధికారులు అంటున్నారు.  ప్రస్తుతం ఇదే అంశం నాగర్​కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దళారులు, బడా నేతలు, పోలీసులు, అధికారుల అండదండలతో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ అనుమతులు పొంది.. అవే అనుమతులతో అక్రమంగా ఇసుకను పట్టణాలకు తరలిస్తున్నారు. కోట్లు దండుకుంటూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు.

sand mafia in nagar kurnool district
నాగర్​కర్నూల్​ జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దందా

By

Published : Dec 13, 2019, 6:59 AM IST

నాగర్​కర్నూల్​ జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దందా

నాగర్​కర్నూల్ జిల్లాలో ఇసుక దొరకడం లేదని భవన నిర్మాణ కార్మికులు ఏకంగా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగితే.. అధికారులు మాత్రం... జిల్లాలో పుష్కలంగా ఇసుక ఉందంటున్నారు. జనానికి అందకుండా, ప్రభుత్వ పథకాలకు చేరకుండా మరీ ఇసుక ఎక్కడికి వెళ్తుందనే అంశం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఇసుక అక్రమ దందా గుట్టుచప్పుడు కాకుండా జోరుగా సాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అధికారికంగానే 23 ఇసుక రీచ్​లు నడుస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటాయని రెండు చోట్ల భూగర్భ జలశాఖ అనుమతులు ఇవ్వలేదు. మిగిలిన చోట్ల కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉంది.

రహస్య స్థలాల్లో డంపులుగా పోసి..

గుత్తేదారులు ప్రభుత్వ పథకాల పేరు చెప్పి ఇసుకను గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ సహా నాగర్​కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ లాంటి పట్టణాల్లో అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. ముందుగా ఇసుక రీచ్​ల నుంచి టిప్పర్ల ద్వారా తరలించి రహస్య స్థలాల్లో డంపులు పోసి అక్కన్నుంచి ఇసుకను ప్రైవేటు అవసరాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమదందాకు కొందరు పలుకుబడి ఉన్న నాయకులు, అధికారులు, పోలీసులు కూడా సహకరించడం వల్లే దందా యథేచ్ఛగా సాగుతోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.

దళారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి

సామాన్య జనానికి అవగాహన లేకపోవడంతో అధికారులను సంప్రదించకుండా దళారుల ద్వారా ఎక్కువ ధరకు ఇసుక తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వం ద్వారా కంటే దళారుల నుంచే త్వరగా ఇసుక దొరుకుతుందనే భావన ప్రజల్లో ఉంది. కృత్రిమ కొరతను సృష్టిస్తున్న దళారులు వినియోగదారులను దోచుకుంటున్నారు. సామాన్యులు ఇసుక కోసం అనుమతులు కోరితే రెవెన్యూ యంత్రాంగం కూడా సకాలంలో స్పందించకపోవడం, ఇబ్బందులకు గురి చేయడం కూడా జనం దళారులను ఆశ్రయించడానికి మరో కారణంగా కనిపిస్తోంది. ఈ మేరకు అటు అనుమతులిచ్చే అధికారులు, అక్రమాలకు పాల్పడే దళారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ఇసుక సరఫరా చేస్తాం

సామాన్యులు ఎవరైనా... తహసీల్దార్ల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ఇసుకను సరఫరా చేస్తామని సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అక్రమంగా ఇసుక రవాణా చేసినా.. అమ్మినా, కొనుగోలు చేసినా... సదరు వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా అధికారులను ఆశ్రయిస్తే అనుమతులతో ఇసుక పొందవచ్చని గుర్తు చేస్తున్నారు.

ఇసుక అక్రమదందాకు అడ్డుకట్ట పడాలంటే... అనుమతులు పొందిన ఇసుక రవాణాపై నిఘా మరింత పెంచాల్సిన అవసరం ఉంది. సామాన్యులకు ఇసుక చేరేలా మరింత పారదర్శకమైన విధానాల్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ABOUT THE AUTHOR

...view details