నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమలలో అటవీ శాఖ సిబ్బంది, పోడు రైతుల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మాధవానిపల్లి సమీప అటవీ ప్రాంతంలోని తాటి చెలుక పోడు భూముల్లో మొక్కలు నాటుతున్న అటవీశాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
తాటి చెలుక ప్రాంతంలోని పోడు భూములను కొన్నేళ్లుగా.. తమ తాతలు, తండ్రులు సాగు చేస్తున్నారని వారి వారసులు తెలిపారు. ఏళ్ల తరబడి నమ్ముకున్న భూముల్లో మొక్కలు నాటి తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటడం దారుణమని వాపోయారు. ప్రభుత్వం స్పందించి రైతులు సాగు చేస్తున్న భూములకు హక్కులను కల్పించాలని నల్లమల యూరేనియం ఐకాస కన్వీనర్ కలుముల నాసరయ్య డిమాండ్ చేశారు.