తెలంగాణ

telangana

ETV Bharat / state

వేగంగా సాగుతున్న రైతువేదిక నిర్మాణ పనులు!

అహర్నిశలు శ్రమిస్తున్న రైతన్నల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే అన్నదాతలకు సేద్యాన్ని మరింత చేరువ చేసేందుకు, సందేహాలు తీర్చుకోవడం, వ్యవసాయ అధికారుల సలహాలు, సమావేశాలు నిర్వహించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలు నిర్మిస్తున్నది. నాగర్​ కర్నూల్​ జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని 143 క్లస్టర్లలో ఉన్న రైతు వేదికల నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా నడుస్తుండటం గమనార్హం.

raithu Vedika Construction Works Fast-paced In Nagar karnool District
వేగంగా సాగుతున్న రైతువేదిక నిర్మాణ పనులు!

By

Published : Sep 13, 2020, 10:26 AM IST

రైతులందరూ సమిష్టిగా కూర్చుని పంటకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇన్​పుట్​ సబ్సిడీ, ప్రభుత్వ పథకాలు, లాభసాటి పంటసాగు, మార్కెటింగ్, ఆధునిక వ్యవసాయంపై వంటి పలు అంశాల మీద రైతులు, అధికారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహించడం కోసం ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రైతు వేదిక నిర్మాణాలు నాగర్​ కర్నూల్​ జిల్లాలో వేగంగా సాగుతున్నాయి. జిల్లాకేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో రూ.22లక్షల వ్యయంతో ఐదు గ్రామాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఈ వేదికల నిర్మాణాలను చేపట్టారు. అన్నదాతలకు దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా పంటసాగు గురించి చెప్పేందుకు, ఉన్నతాధికారులతో వీడియో సమావేశంలో పాల్గొనేందుకు కావాల్సిన అన్ని హంగులతో రైతు వేదికలు నిర్మిస్తున్నారు. ఆధునిక వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, ప్రభుత్వ పథకాలు, సేంద్రియ విధానం, నూతన పనిముట్లు, ఇన్​పుట్​ సబ్సిడీ, రైతుబంధు, రైతుబీమా పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే నూతన పథకాల గూర్చి రైతు వేదికల్లో చర్చించుకోవచ్చు. ఏ భూములు ఎలాంటి వ్యవసాయానికి అనుకూలం? ఏ పంటకు ఎంత యూరియా వేయాలి? ఎంత మందులు చల్లాలి? విత్తనాలు, వాటి కొనుగోలు, ఏయే పంటలకు ఎలాంటి మందులు వేయాలి, ఫెస్టిసైడ్స్ హానికర స్థాయి వంటివన్నీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొని చర్చించవచ్చు. నేరుగా కూడా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులు సమావేశాలు జరపడానికి రైతు వేదికలు ఉపయోగపడుతాయి. పాల ఉత్పత్తి, పశుపోషణ, ఫౌల్ట్రీ, ఆధునిక శాస్త్రాలు, సాంకేతికత వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించడానికి రైతు వేదికలు ఉపయోగపడుతాయి.

నాగర్ కర్నూలు జిల్లాలోని నాలుగు డివిజన్లలో ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ గా మొత్తం 143 క్లస్టర్​లలో రైతు వేదికలు నిర్మిస్తున్నారు. ఈ క్లస్టర్లలో 2-3 నిర్మాణాలు వేర్వేరు కారణాలతో ఆగినా ఇప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా శంకుస్థాపనలు పూర్తయి పనులు నడుస్తున్నాయి. జిల్లాలోని 143 క్లస్టర్లలోని అన్ని రైతు వేదికలు ప్రభుత్వ భూముల్లోనే నిర్మిస్తున్నారు. కొన్ని క్లస్టర్ నిర్మాణ పనులు బేస్మెంట్, కొన్ని లేంటల్, మరికొన్ని పిల్లర్ల దశలో మరికొన్ని స్లాబ్ దశ వరకు చేరుకున్నాయి. జిల్లాలో ఈ నిర్మాణాలు ఏజెన్సీలు, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా పనులు నిర్వహిస్తున్నారు. దీనిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ చౌహన్ ఆకస్మిక తనిఖీల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈనెల సెప్టెంబర్ 30 దసరా పండగ వరకు వీటి నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశాలు ఉండడం వల్ల రైతు వేదిక నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన సమయం వరకు జిల్లాలోని అన్ని రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాణ్యంగా, వేగంగా పనులు జరుగుతున్నాయని ఆర్అండ్​బీ అధికారి మహేష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి :కొత్త రెవెన్యూ చట్టంతో పేదలు, రైతులకు మేలు: పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details