Raging in achhampet Gurukulam విద్యాసంస్థల్లో సోదరభావంతో మెలగాల్సిన సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య ర్యాగింగ్ భూతం బయటకు వస్తోంది. ఈ విష సంస్కృతి విద్యార్థుల మధ్య చిచ్చుపెడుతోంది. జూనియర్లను వేధించాలన్న సీనియర్ల పైశాచిక ఆనందం... విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోంది. అంతే కాదు... వారి ప్రాణాలు హరిస్తోంది. పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకునే తల్లిదండ్రులకు తీరని వేదన మిగుల్చుతుంది.
కళాశాల నిర్వాహకులు, యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరితో.. విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయి. ఇటీవల వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో సీనియర్ వేధింపులకు బలైపోయిన మెడికో పీజీ విద్యార్థిని ప్రీతి ఘటన మరవక ముందే.. మరిన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా... ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.
అయితే తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చం పేటలో ఓ గురుకులంలో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేగుతోంది. ఇన్ని రోజులు కళశాలలకు అంకితమైన ర్యాగింగ్.. ఇప్పుడు స్కూళ్లకు కూడా పాకినట్లు అర్థం అవుతోంది. సీనియర్ విద్యార్థులు... జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తూ రెచ్చిపోయారు. అసలు జరిగిన విషయం ఏమిటంటే... నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలోని విద్యార్థులను... కళాశాలలో చదువుతున్న విద్యార్థులు రాత్రి వేళ చితకబాదారు.