నాగర్‌కర్నూలులో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం... జడ్పీ ఛైర్మన్ పెద్దపల్లి పద్మావతి అధ్యక్షతన జరిగింది. జిల్లాను అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. ప్రధానంగా మిషన్ భగీరథ, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, అటవీ, విద్యాశాఖ, ఎన్ఆర్ఈజీఎస్, మైనింగ్ శాఖలపై చర్చించారు. జిల్లాలోని పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు పలువురు జిల్లా స్థాయి అధికారులు, ప్రభుత్వ సిబ్బంది విధుల పట్ల అలసత్వం వహిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజాప్రతినిధులు ఆరోపించారు. కొవిడ్‌కు జిల్లావ్యాప్తంగా ఎంత ఖర్చు చేశారో నివేదికలు సమర్పించాలని కోరారు. మైనింగ్ శాఖ ద్వారా వచ్చిన రూ.60 కోట్లతో జిల్లాను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో నెట్వర్క్ సమస్యల వల్ల ఆన్లైన్ క్లాసులు విద్యార్థులు వినలేక పోతున్నారని... ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తెలిపారు. ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని కోరారు.