తెలంగాణ

telangana

ETV Bharat / state

Problems in Govt School : 'ఈ భోజనం మేం తినలేకపోతున్నాం సార్' - మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు

Problems in Govt School in Telangana : కొత్త మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టకుండా.. ఇప్పటికీ పాత మెనూ ప్రకారమే పెడుతున్నారని నాగర్​కర్నూల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు వాపోతున్నారు. మధ్యాహ్న భోజనంలో ఎన్నో లోపాలు ఉంటున్నాయని, ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో సరైన వసతుల్లేక ఇబ్బంది పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Problems in Govt School
Problems in Govt School

By

Published : Jul 14, 2023, 6:04 PM IST

Problems in Govt School in Nagarkurnool : నాగర్​కర్నూల్ జిల్లాలో మొత్తం 848 పాఠశాలలు.. 82,945 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చదువుతున్నారు. వీరందరికీ ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఏడాదిది రెండు జతల స్కూల్ డ్రెస్సులను అందిస్తున్నారు. వీటితో పాటు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు రాగి జావా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. విద్యార్థులను ప్రభుత్వ బడులవైపు ఆకర్షించేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలకు శ్రీకారం చుడుతున్నా.. అవి విద్యార్థులకు అందడంలో జాప్యం జరుగుతోంది. మన ఊరు మన బడిలో భాగంగా పాఠశాలలను ఆధునికీకరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. పలుచోట్ల పనులు మందకొడిగానే కొనసాగుతున్నాయి.

మరోవైపు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలని ఇప్పటికే పాఠశాలకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో పాత మెను ప్రకారమే ప్రస్తుతం మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. వారంలో సోమ, బుధ, శుక్రవారంలో మధ్యాహ్న భోజనంతో పాటు ఉడికించిన కోడిగుడ్డు అందిస్తున్నారు. మిగతా మూడు రోజులు అల్పాహారంగా రాగి జావా అందించాల్సి ఉంది. రాగి జావా తయారీకి అవసరమైన ముడి సరుకులను సరఫరా చేసేందుకు శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ముందుకు వచ్చింది. డీఈవో ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ ట్రస్ట్ ముడి సరుకులను సరఫరా చేయనుంది. కానీ ఇప్పటి వరకు పిల్లలకు రాగి జావా అందలేదు. వీటితో పాటు ప్రస్తుతం అందుతున్న మధ్యాహ్న భోజనంలోనూ ఎన్నో లోపాలు ఉన్నాయని విద్యార్థులు వాపోతున్నారు. మరోవైపు.. మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా వంటలు చేసే ఏజెన్సీ వారికి గత 6 నెలల నుంచి బిల్లులు అందలేదు. దీంతో వారూ చేతులెత్తేస్తున్నారు. కొత్త ఏజెన్సీ వారూ రావడం లేదు. ప్రభుత్వం గౌరవ వేతనం రూ.3000 అందిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉందని వంట కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పలుచోట్ల పాఠశాల భోజనం తినలేక.. పలువురు విద్యార్థులు ఇంటి వద్ద నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారు. ఇక రాగి జావా జులై 1 నుంచి రెగ్యులర్​గా ఇస్తామని చెప్పినా.. ఇంతవరకు దానికి సంబంధించిన సరకు రాకపోవడంతో ఇంకా విద్యార్థులకు అందించడం లేదు. ఇవే కాక పిల్లలకు దుస్తుల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పాఠ్య పుస్తకాలు పూర్తిగా అందలేదు. విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నచోట సరిపడా మరుగుదొడ్లు లేవు. కొన్నిచోట్ల ఉన్నా.. వాటికి డోర్లు సరిగా లేవు. మరికొన్ని చోట్ల నీరు రావడం లేదని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మగ విద్యార్థులు అయితే బయటి ప్రాంతాల్లోనే మూత్ర విసర్జన చేస్తున్నారు. అయితే.. కొన్ని పాఠశాలల్లో సమస్యలు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని.. వాటిని మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పూర్తి చేస్తామని, రాగి జావా త్వరలోనే అందిస్తామని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు స్పష్టం చేశారు.

కొన్ని పాఠశాలల్లో సమస్యలు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. వాటిని మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పూర్తి చేస్తాం రాగి జావా కార్యక్రమాన్ని రాగి, బెల్లం రాగానే విద్యార్థులకు అందజేస్తాం. దుస్తుల పంపిణీ కూడా ఒక విభాగం అయిపోయింది. మరో రకం దుస్తుల పంపిణీని త్వరలోనే పూర్తి చేస్తాం. - గోవిందరాజులు, జిల్లా విద్యాధికారి

Problems in Govt School : 'ఈ భోజనం మేం తినలేకపోతున్నాం సార్'

ఇవీ చూడండి..

ఎంచుకున్న లక్ష్యానికి.. చేసిన పనులకు పొంతన లేకుండా మన ఊరు-మన బడి

నీరుగారుతున్న మన ఊరు మన బడి కార్యక్రమం.. కొత్త నిధులతో పాతవాటికే మెరుగులు

ABOUT THE AUTHOR

...view details