Death of a newborn baby: ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన ఆ తల్లి చివరకు తన బిడ్డను కోల్పోయింది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. పదర మండల కేంద్రానికి చెందిన చాట్ల మంజుల పురిటి నొప్పులు వస్తున్నాయని ఈ నెల 25న అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది.
నొప్పులు తీయట్లేదని దాడి: బుధవారం ఉదయం సాధారణ ప్రసవం చేయడం కోసం గదిలోకి వెళ్లారు వైద్యులు. ప్రసవానికి ఇంకా సమయం ఉందంటూ వారు బయటికి వచ్చేశారు. నీకు నొప్పులు తీయడం రావడం లేదంటూ సిబ్బంది ఆ గర్భిణిపై దాడికి ఒడి గట్టారు. చేతులను పట్టుకుని, కడుపుపై కొడుతూ ఎట్టకేలకు తనకు బలవంతంగా ప్రసవం చేశారు. పుట్టిన బిడ్డ స్పృహ కోల్పోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు శిశువు చనిపోయిందని నిర్ధారించారు.
చివరికి శిశువు మృతి: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మరణించిందని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ప్రధాన రహదారిపై కుటుంబసభ్యులు రాత్రి ఆందోళన చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వీడకుంటే శిశువు మృతదేహాన్ని వైద్యురాలి ఇంటి వద్దకు తీసుకెళ్లి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకుని ఆసుపత్రికి చేరుకున్న సూపరింటెండెంట్ కృష్ణను పదర జడ్పీటీసీ సభ్యుడు రాంబాబు నాయక్‌ను బాధిత కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నేతలు నిలదీయగా.. వారు బాధిత కుటుంబసభ్యులను సముదాయించారు.
"నా పేరు మంజుల. నాకు పురిటి నొప్పులు రావడంతో మధ్యాహ్నం 2 గంటల సమయానికి ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చాను. నన్ను పట్టించుకునే వారు లేరు. రాత్రంతా నొప్పులు విపరీతంగా వచ్చిన కూడా పట్టించుకునే వారే లేదు. ఐదారుగురు వస్తున్నారు చూస్తున్నారు, పోతున్నారు. నొప్పులు ఎక్కువ రావడంతో సిజేరియన్ చేయమని అడిగాను. కానీ చేయడానికి ఎవ్వరూ రాలేదు. అడిగితే సార్ వాళ్లకి ఫోన్ చెయ్యండి అన్నారు తప్ప పట్టించుకునే వారు లేరు. మంగళవారం, బుధవారం సిజేరియన్ చేయాల్సిన వారందరికీ చేయకుండా ఆపేశారు. ఉదయం 11 గంటలకు ప్రసవం చేస్తామని తీసుకెళ్లి నన్ను కొట్టి బలవంతం చేసి మా పాపని చంపేశారు".-మంజుల, బాధితురాలు
ఇవీ చదవండి: