Staff Shortage in Kollapur Govt Hospital: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు.. 2022 జనవరిలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 50 పడకల ఆసుపత్రి ప్రారంభించారు. 24 గంటల సేవలందించే ఆసుపత్రికి నిత్యం 30 మంది ఓపీకి వస్తున్నారు. సగటున నెలకు 30 ప్రసవాలు జరుగుతాయి. 24 గంటల ఆసుపత్రి కావడంతో మూడు షిఫ్టుల్లో వైద్యులు, సిబ్బంది పని చేయాలి. కొల్లాపూర్ ఆసుపత్రిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
Kollapur MCH Problems: ఇద్దరు గైనకాలజిస్టులకు ఒక్కరే.. అదీ డిప్యూటేషన్‌పై సేవలందిస్తున్నారు. 18 మంది సిబ్బందికి 11 మందే పని చేస్తున్నారు. మిగిలిన వారు శిక్షణ పేరుతో ఇతర ఆసుపత్రులకు పంపారు. పిల్లల వైద్యం కోసం ప్రభుత్వం అసలు వైద్యులనే కేటాయించలేదు. ముగ్గురు వైద్యులతోనే 24 గంటలు మూడు షిఫ్టులను అతి కష్టం మీద నెట్టుకొస్తున్నారు. నవ జాత శిశువుల్లో గుండె సంబంధిత లోపాలు గుర్తించడానికి అవసరమైన పరికరాలు అందుబాటులో లేవు.
ఆసుపత్రికి వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ కనెక్షన్: కామెర్లను తగ్గించే ఫొటోథెరపీ లేదు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆక్సిజన్ సౌకర్యం లేదు. తల్లి ఉన్నచోటే పిల్లలకు సైతం అత్యవసర వైద్యం అందుబాటులో ఉంటే పిల్లల్ని పట్టుకుని జిల్లా ఆసుపత్రులకు తిరగాల్సిన అవసరం ఉండదు. అందుకే నవజాత శిశువులకు అత్యవసర వైద్య కేంద్రాన్ని సైతం ఇక్కడ ఏర్పాటు చేయాలని వైద్యులు కోరుతున్నారు. ఆసుపత్రికి వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో.. 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉండటం లేదు.