తెలంగాణ

telangana

ETV Bharat / state

Assigned lands: అసైన్డ్​ భూములకు పట్టాలు.. వేల ఎకరాల ప్రభుత్వ భూములకు రెక్కలు - అసైన్డ్ భూములు

‘ఇది చాకిరిగుట్ట. 177 సర్వే నంబరులో ఉంది. విస్తీర్ణం 459 ఎకరాలు. అంతా అటవీప్రాంతమే. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండల శివారులో ఉంది. పదిహేనేళ్ల క్రితం కొందరికి ఇక్కడ ఎసైన్డ్‌ పట్టాలు ఇచ్చారు. మూడేళ్ల క్రితం మరో 150 మందికి అవి లభించాయి. పాత పహాణీలలో లబ్ధిదారులుగా కొందరి పేర్లను ఎక్కించి దొడ్దిదారిన పాసుపుస్తకాలు జారీచేశారు. లింగాలతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, కొందరు రాజకీయనేతల కుటుంబసభ్యుల పేర్లతో భూమిని నమోదు చేశారు.

pattas sanctioned for governement assigned lands
అసైన్డ్​ భూములకు పట్టాలు

By

Published : Dec 16, 2021, 5:00 AM IST

ఒకరిద్దరికి కాదు.. నిబంధనలకు పాతరేస్తూ ఏకంగా వందల మందికి భూమి పట్టాలు జారీ అయ్యాయి. వారంతా ధరణి పోర్టల్లోనూ నిక్షిప్తమయ్యారు. సాగంటే తెలియని వ్యాపారులు, రాజకీయ నాయకులు కూడా పట్టాదారులయ్యారు. నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో భూదస్త్రాల ప్రక్షాళనను ఆసరాగా చేసుకుని పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఎవరూ గుర్తించని ప్రాంతాలను ఎంచుకుని ఉపసంఖ్యలు వేసి మరీ పట్టాలు రాసిచ్చారు. వీరందరికీ రైతుబంధు నిధులూ అందుతున్నాయి. మున్ముందు యాజమాన్య హక్కుల కోసం పట్టుపడితే కొండలు, గుట్టలు, అటవీప్రాంతం అంతా వారి హస్తగతం కాకపోదు. ఈ అక్రమంపై ఈటీవీ భారత్ క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించగా అనేకానేక విషయాలు వెలుగుచూశాయి. రెవెన్యూ రికార్డుల్లోని వివరాలను, క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలిస్తే పొంతనే కనబడలేదు. అక్రమంగా పట్టాలిచ్చిన విషయం ఇన్నాళ్లూ గుట్టుగానే ఉంది. మూడేళ్ల నుంచి అర్హులకు రైతుబంధు డబ్బు రావటం లేదు. ఈ క్రమంలో దస్త్రాలను పరిశీలించగా కొత్త వ్యక్తులు హక్కులు చేజిక్కించుకున్న వైనం ఒక్కోటీ బయటపడుతోంది.

ఎసైన్డ్‌ను ఆసరాగా చేసుకుని..
నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో ఎసైన్డ్‌ భూములను లక్ష్యంగా చేసుకుని అక్రమానికి తెరతీశారు. మారుమూల మండలాలైన లింగాల, కొల్లాపూర్‌, కూడేరు ప్రాంతాల్లో 2017 సెప్టెంబరు తర్వాత కొత్త పట్టాలు జారీ అయ్యాయి. ఒక్కో ఎకరాకు పట్టా జారీకి కనీసం రూ.10వేల వరకు వసూలు చేశారు. కొందరు రెవెన్యూ అధికారులు, దళారుల ప్రమేయంతో రెండు నుంచి ఐదెకరాల వరకు పట్టాల్లో విస్తీర్ణాన్ని నమోదు చేశారు. లింగాల మండల శివారుల్లోని ఒక గుట్ట అటవీప్రాంతంలో ఉంది. దాని దిగువన 20 మందికి 1977లో ఎసైన్డ్‌ పట్టాలిచ్చారు. దాన్ని ఆసరాగా చేసుకుని కథ నడిపారు. ఆ సర్వే నంబరుకు ఉపసంఖ్యలు జోడించి వందల మందికి ఎసైన్డ్‌ కింద రాసిచ్చేశారు. పట్టాపాసుపుస్తకాలూ జారీ అయ్యాయి. ఈ మండలంలో పదికిపైగా రెవెన్యూ గ్రామాల్లో ఇలా పెద్దఎత్తున పట్టాలిచ్చారు. ఇక్కడ హీనపక్షం ఎకరా భూమి రూ.20 లక్షల ధర పలుకుతోంది. అంటే రూ.వందల కోట్ల విలువైన సర్కారు భూమి

అన్యాక్రాంతమైనట్లే లెక్క..
* లింగాల పరిధిలో 63, 191, 281, 360, 361, 436, 437, 488, 642, 793 సర్వే నంబర్లు, ఉప నంబర్లలో 5,937 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అనంతరం వాటికి మరికొన్ని ఉపసంఖ్యలు జోడించారు. దాదాపు 1200 ఎకరాలకు సంబంధించి 550 మందికి కొత్తగా పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. వీటిలో ముప్పావుభాగం లావూని పట్టాలు ఇచ్చారు. సర్వే నంబరు 63లో 260 ఎకరాల గుట్ట ఉండగా 40 మందికి పట్టాలు అందజేశారు. 576 సర్వే నంబరులో నెమ్మళ్లగుట్ట ఉండగా ఇందులోనూ లావూని కింద రాసిచ్చారు. అప్పాయపల్లి, దారారం, శ్రీరంగాపూర్‌, పలు తండాల కింద ఉన్న ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని కొత్త వ్యక్తుల పేర్లతో పట్టాలిచ్చేశారు.
* నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలో ఏకంగా 2000 పట్టాలు కొత్తగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో పట్టా జారీకి రూ.వేలల్లో చేతులు మారినట్లు సమాచారం’
*పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట పరిధిలో 96వ సర్వే నంబరులో కొందరు అనర్హులకు కూడా అక్రమంగా పట్టాలు జారీ చేశారు.
* కూడేరు మండలంలోని 429 సర్వే నంబరులో వాగును ఆనుకుని 500 ఎకరాల పట్టా భూమి ఉంది. 2018 తర్వాత మరో 500 ఎకరాలను అదనంగా కొందరు ఖాతాల్లోకి చేర్చారు.

ఆ జిల్లాల్లోనూ అక్రమాలు
* నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మల్లారంలోని 130, 131, 132 సర్వే నంబర్లలో కొందరికి అక్రమంగా పట్టాలు జారీ చేశారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
*జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పలిమెల, ఏటూరునాగారం మండలాల్లో అటవీ భూములకు పట్టాలిచ్చారు. కొన్నిచోట్ల భూమి ఎక్కడుందనేది లబ్ధిదారులకు సైతం తెలియకపోగా చేతిలో మాత్రం పాసుపుస్తకాలు ఉన్నాయి.
*నారాయణపేట జిల్లా బొమ్మన్‌పహాడ్‌ గ్రామ పరిధిలో 225, 110, 116, 117 సర్వే నంబర్లలో 1520 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం సందర్భంగా స్థానిక రెవెన్యూ సిబ్బంది సాయంతో కొందరు నాయకులు ఆ సర్వే నంబర్లలో భారీ విస్తీర్ణానికి అక్రమంగా పట్టాలు పొందారు.

నిబంధనలేం చెప్తున్నాయ్‌..
ఎమ్మెల్యే, ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ఉండే కమిటీలు గతంలో నిరుపేదలు, రాజకీయ బాధితులు, ఇతర నిమ్నవర్గాల వారికి ప్రభుత్వ భూములను ఎసైన్‌ చేసేవి. ఇందుకోసం సమావేశం నిర్వహించి నోటిఫికేషన్‌ ఇచ్చి గెజిట్‌లో నమోదు చేసేవారు. ఇంత ప్రక్రియ ఉన్నా కొందరు రెవెన్యూ అధికారులు ఎసైన్డ్‌ చట్టాన్ని, నిబంధనలను తోసిరాజని వందల మందికి దొడ్డిదారిన ఎసైన్డ్‌ పట్టాలిచ్చారు. వీరెవరూ గెజిట్‌లో నమోదుకాకున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పట్టాదారులుగా చలామణి అవుతున్నారు.

మరొకరికి పట్టా ఎలా ఇస్తారు?
- పి.మల్లయ్య, రైతు, అప్పాయపల్లి, లింగాల మండలం

లింగాల శివారు అప్పాయపల్లి పరిధి 361 సర్వే నంబరులో మా కుటుంబానికి పొలం ఉంది. మేమే సాగు చేసుకుంటున్నాం. మా భూమి పేరిటే మా సర్వే నంబర్‌లోనే మరెవరికో పాసుపుస్తకం జారీ చేశారు. ఒకే భూమికి రెండు పాసుపుస్తకాలు ఎలా ఇస్తారు? దీన్ని సరిచేయాలని ఎంతమంది అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదు.

కొత్త వ్యక్తులకు పట్టాలిచ్చారు
- మహేష్‌, రైతు, అప్పాయపల్లి శివారు

మాకు 361 సర్వే నంబరులో ఉపసంఖ్యలు కలిపి 110 ఎకరాల భూమి ఉంది. దానికి పాత పాసుపుస్తకమూ ఉంది. 2017 తర్వాత అన్‌లైన్‌ రికార్డుల నుంచి మా భూమి తొలగించారు. సాగుచేయని వ్యక్తులకు హక్కులు కల్పించారు. అనర్హులకు పాసుపుస్తకాలిచ్చారు. అర్హులైన మాకు మాత్రం ఇవ్వడం లేదు.

ABOUT THE AUTHOR

...view details