ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాలుగు జిల్లాల పరిధిలో మగ్గంతో ముడిపడి మొత్తం 10 వేలకు పైగా చేనేత కుటుంబాలు ఉండగా, ఇందులో జియోట్యాగింగ్ సర్వే ప్రకారం 3,450 మగ్గాలున్నాయి. ఒక్కో మగ్గానికి ఇద్దరు కార్మికుల చొప్పున త్రిఫ్టు ఫండ్ పథకంలో చేరేందుకు అవకాశం ఉంది. ఇందులో కార్మికుడు సంపాదించిన దాంట్లో 8 శాతం బ్యాంకు ఖాతాలో జమచేస్తే.. దీనికి ప్రభుత్వం రెండో ఖాతాలో 16 శాతం డబ్బును జమ చేస్తోంది. ఈ డబ్బు మొత్తాన్ని మూడేళ్ల తరువాత తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. 2017 ఆగస్టులో ఈ పథకం ప్రారంభమవగా ఇప్పటి వరకు 5,071 మంది కార్మికులు వారి ఖాతాల్లో డబ్బును జమ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా కార్మికులు తమ ఖాతాల్లో రూ.3 కోట్లు జమ చేయగా, ప్రభుత్వం రూ.6 కోట్ల వరకు డబ్బు జమ చేసినట్లుగా అంచనా. మొత్తంగా ఉమ్మడి జిల్లా నేతన్నలకు రూ.9 కోట్లకు పైగా త్రిఫ్టు ఫండు నిధులు చేతికి అందించనున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కోరల్లో చిక్కుకున్న చేనేత రంగానికి ఇది ఎంతో ఊరటని కార్మిక సంఘాలు అంటున్నాయి.
అయిదేళ్ల తరవాత సంఘాలకు
చేనేత సహకారం సంఘాలకు గతంలో త్రిఫ్టు ఫండ్ పథకం అమల్లో ఉండేది. వారు 8 శాతం జమ చేస్తే.. మరో 8 శాతం ప్రభుత్వం జమ చేసేది. అయితే.. ఈ పథకం అయిదేళ్ల క్రితం నిలిచిపోయింది. పథకం ఆగిపోయే నాటికి సంఘాలకు సంబంధించిన నిధులు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. వీటికి సంబంధించిన నిధులు కూడా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని రాజోలి, అలంపూర్, వెల్టూరు, రాజాపూర్, పెద్దఅజరాల సంఘాలకు ఆ నిధులు అందనున్నాయి. దీనావస్థలో ఉన్న సంఘాలకు, కార్మికులకు డబ్బు అందనుంది.