ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొవిడ్-19 కేసుల విజృంభణ కొనసాగుతోంది. సోమవారం కొత్తగా 29 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 478కి చేరింది. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 17 కేసులు బయటపడగా.. నాగర్‌కర్నూల్ జిల్లాలో 5, గద్వాల జిల్లాలో 5, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదయ్యాయి.
మహబూబ్‌నగర్‌లో..
మహబూబ్‌నగర్ జిల్లాలో 17 మంది కరోనా బారినపడగా.. పట్టణంలోనే 11 మందికి వైరస్ సోకింది. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇది వరకే ఒకరికి కరోనా నిర్ధారణ కాగా.. అదే ఇంట్లో మరో ముగ్గురుకి పాజిటివ్ వచ్చింది. మైత్రీనగర్, పద్మావతి కాలనీ, బీకే రెడ్డి కాలనీల్లో రెండేసి చొప్పున.. మొత్తం 6 మంది కరోనా బారినపడ్డారు. గణేశ్‌నగర్‌లో ఒకరు, హన్వాడ మండల కేంద్రంలో ఒకరికి కరోనా నిర్ధారణయింది. జడ్చర్లలో ఐదుగురు ఈ మహమ్మారి బారినపడగా.. వారిలో ఇద్దరు దంపతులు, ఒక విద్యార్థి, ఓ దుకాణా యజమాని, ఒకరు ఫార్మా కంపెనీ ఉద్యోగిగా ఉన్నారు.
నాగర్ కర్నూల్లో..
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. అమ్రాబాద్ మండలం ఈగలపెంట జెన్కోలో పనిచేస్తున్న ఉద్యోగితో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులు వైరస్ బారినపడ్డారు. నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన ఓ ఎస్సైకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. అచ్చంపేట పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కరోనా బారినపడినట్టు వైద్యాధికారి వెల్లడించారు.