నాగర్ కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి మళ్లీ పడగ విప్పుతోంది. రెండు రోజుల క్రితం చారగొండ మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి వైరస్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తికి కొవిడ్-19 సోకిందని వైద్య శాఖ అధికారి సుధాకర్ లాల్ ధ్రువీకరించారు.
ఈ వ్యక్తి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్ని రోజుల క్రితం చికిత్స తీసుకున్నాడని ఆయన తెలిపారు. అయితే వైరస్ అక్కడి నుంచి సోకిందా లేక గ్రామంలోనే.. సోకిందా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నామని సుధాకర్ పేర్కొన్నారు. గ్రామంలోని ఓ వివాహ వేడుకలో కూడా ఆ వ్యక్తి పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వారందరినీ, కుటుంబ సభ్యులను క్వారంటైన్లో ఉండాలని ఆదేశించామని తెలిపారు.