మూడేళ్లు గడిచినా డిండి రైతులకు అందని పరిహారం! Dindi Farmers Compensation Issue : నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లికి చెందిన బుచ్చిరెడ్డి- రజితమ్మకు చెందిన 4 ఎకరాల భూమి డిండి ఎత్తిపోతల పథకం కోసం 2017లో ప్రభుత్వం సేకరిచింది. 15 రోజుల్లో పరిహారం చెల్లిస్తామని చెప్పి నాలుగేళ్లు గడుస్తున్నా పైసారాలేదు. 8 ఏళ్ల కిందట బుచ్చిరెడ్డి అనారోగ్యంతో చనిపోగా.. రజితమ్మ హైదరాబాద్‌కు వలసవెళ్లి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఇటీవలే ఆమె కన్నుమూయగా.. ఊళ్లో ఇల్లు, భూమి లేక ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. చివరకు డీఎల్ఐ కింద కోల్పోయిన భూమి పక్కనే దహన సంస్కారాలు చేశారు. టెంటు వేసుకుని కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని రజితమ్మ కుమారుడు ప్రశాంత్ రెడ్డి వాపోయారు.
2017లో డిండి ప్రాజెక్టు కోసం మా భూములు తీసుకున్నారు. ఇంతవరకు మాకు నష్టపరిహారం రాలేదు. కాల్వ తీసి కూడా చాలా రోజులు అయింది. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మాకు ఇల్లు కూడా లేదు. పొలం దగ్గర టెంట్ వేసుకొని ఉన్నాం. వెంటనే డబ్బులు ఇస్తే వేరే దగ్గర ఓ రెండు ఎకరాలన్న కొనేవాళ్లం. కానీ ఇప్పుడు ఒక ఎకరం కూడా కొనే పరిస్థితి లేదు.
-ప్రశాంత్ రెడ్డి, బాధితుడు
మూడు రెట్లు అధికంగా చెల్లించాలి..
డిండి ఎత్తిపోతల పథకం కోసం భూములిచ్చిన ఎంతో మంది రైతులకు దాదాపు పరిహారం అందలేదు. పరిహారం రాకపోవడం ఒక ఎత్తైతే... మూడేళ్లుగా ఆ భూములపై రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయారు. కొన్నిచోట్ల కాల్వలు తవ్వి వదిలేశారు. మరికొన్ని ప్రాంతాల్లో భూముల్ని పడావుగానే ఉంచారు. పోనీ, ఇతర రైతులకైనా మేలు జరిగిందా అంటే అదీలేదు. మూడేళ్లు గడుస్తున్నా డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక్క ఎకరాకు సాగునీరు అందలేదు. భూముల రేట్లకు రెక్కలు రావటంతో... ప్రస్తుతం ప్రభుత్వమిచ్చే పరిహారంతో గుంట భూమి కొనుగోలు చేసే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్ విలువకు మూడు రెట్లు అధికంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతులు ససేమీరా..
డిండి ఎత్తిపోతలకు మొత్తం 3,689 ఎకరాల భూములు సేకరించాల్సి ఉంది. ఇందులో 2,700 మంది రైతుల నుంచి 3,139 ఎకరాలు సేకరించారు. 513ఎకరాలు ప్రభుత్వ భూములు. రైతులు అప్పగించిన భూముల్లో 1220 ఎకరాలకు పరిహారం చెల్లించారు. మరో 1300 ఎకరాలకు 73 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. సేకరించాల్సిన భూములు మరో 600 ఎకరాలు ఉన్నాయి. ఇందుకు రైతులు సహకరించడం లేదు. పోలీసు సహాయంతో వెళ్లినా.... భూములు ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారు.
నో రెస్పాన్స్
డిండి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు రెండో విడతలో రూ.73 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వివరాలు సేకరించి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఇదీ చదవండి:CM on Raithu bandhu: అర్హులైన అన్నదాతల ఖాతాల్లో నగదు జమ: కేసీఆర్