నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చెరువుల ఆక్రమణలపై తనిఖీలు జరిపేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ రామకృష్ణన్ ధర్మాసనం... చెరువుల ఆక్రమణలపై సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఉన్నా చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
'చెరువుల ఆక్రమణలపై సంయుక్త కమిటీ'
నాగర్ కర్నూల్లో చెరువుల ఆక్రమణలపై ఎన్జీటీ సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. రెండు నెలలో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 8కి వాయిదా వేసింది.
చెరువుల దురాక్రమణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ఎన్జీటీ.. ఆక్రమణలపై తనిఖీలు జరిపేందుకు సాగునీటి శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, కలెక్టర్, జిల్లా చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది.
ఇప్పటికే విచారణ జరిపి 25 మంది ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చామని.. మళ్లీ కమిటీ అవసరంలేదన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో ఏకీభవించని ఎన్జీటీ... రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని సంయుక్త కమిటీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.